రాజకీయ నేతలు వేరు ప్రజలు వేరని.. రాజకీయ నేతల విమర్శలకు రాజకీయంగానే సమాధానం చెప్పాలి కానీ..తెలంగాణ ప్రజల్ని కించపర్చడం సరి కాదని.. వెంటనే వైసీపీ మంత్రులు తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. ఇందులో తప్పేమీ ఉందో కానీ.. వైసీపీ నేతలు మీడియా ముందుకు వచ్చి పవన్ కల్యాణ్‌పై దాడి చేస్తున్నారు. వైఎస్ వివేకా హత్య కేసులో వైసీపీ కొంప అంటుకున్నట్లుగా స్పష్టంగా కనిపిస్తున్నా ఒక్క మాట దానిపై మాట్లాడకుండా.. పవన్ కల్యాణ్‌పై విమర్శలు చేయడానికి మాత్రం అత్యవసరంగా మీడియా సమావేశం పెట్టారు.
హరీష్ రావు ఏదో ఏపీని అవమానించారన్నట్లుగా పేర్ని నాని చెప్పుకొచ్చారు. సొంత రాష్ట్రంపై ప్రేమ లేని పవన్ కల్యాణ్.. ఏపీ మంత్రులపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. పవన్ ఏపీని అవమానిస్తూ మాట్లాడుతుంటే చూస్తూ ఉండాలా అని ప్రశ్రించారు. కన్న తల్లి లాంటి రాష్ట్రం గురించి మాట్లాడుతుంటే ఎందుకు చూస్తూ ఊరుకోవాలా అని ఆవేశపడ్డారు. పవన్ కల్యాణ్ కు బీఆర్ఎస్ పై, తెలంగాణ పై ఎందుకంత ప్రేమ వచ్చిందో తనకు అర్థం అవ్వట్లేదని .. ఏదో కొత్త బంధం కోసం ఆయన ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ సందర్భంగా తెలంగాణ మంత్రుల వీడియోల్ని ప్రదర్శించారు.
అయితే తెలంగాణ మంత్రులు ఏపీలో పరిస్థితుల్ని.. ప్రభత్వ చేతకాని తనాన్ని బయట పెట్టారు కానీ.. ఏపీని.. ప్రజల్ని కించపర్చలేదు. కానీ ఏపీ మంత్రులు .. ముఖ్యంగా సీదిరి అప్పలరాజు మాత్రం తెలంగాణ ప్రజలకు బుర్రలేదని అందర్నీ కలిపి అనేశారు. ఇదే తీవ్ర విమర్శలకు కారణం అయింది. పవన్ కూడా ఇలా తిట్టడం తప్పని చెబితే ఆయనపై దాడి చేస్తున్నారు. ఏపీ నేతలు తమకు కౌంటర్ ఇవ్వడానికి కూడా భయపడుతూండటంతో.. హరీష్ రావు మరింత రెచ్చిపోతున్నారు. వైసీపీ నేతలకు దమ్ముంటే ప్రత్యేకహోదా, ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని అంటున్నారు.