తెలంగాణ ప్రజలను అవమానించిన వైసీపీ.. క్షమాపణ చెప్పాలని జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. ఇటీవల హరీష్ రావు ఏపీ ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలను తిప్పి కొట్టేందుకు ఏపీ మంత్రులు ఘాటు భాషను ప్రయోగించారు. ముఖ్యంగా మంత్రి సీదిరి అప్పలరాజు చాలా అసహ్యంగా స్పందించారు. తమకు అలవాటైన భాషయలో బీఆర్ఎస్ నేతలపై విరుచుకుపడ్డారు. అయితే ఆయన తిట్లు నేతలకు పరిమితమైతే ఇబ్బంది అయ్యేది కాదు. మొత్తం తెలంగాణను కలిపేసి బూతులు తిట్టారు.
సీదిరి అప్పలరాజు వ్యవహారం సంచలనం రేపింది. తెలంగాణ సమాజంలో ఆగ్రహానికి కారణం అయింది. అయితే ఫ్రెండ్లీ ఫైట్ లో భాగంగా జరుగుతున్న వ్యవాహరంలో సీదిరి అప్పలరాజు లైన్ క్రాస్ చేయడంతో వివాదం ట్రాక్ తప్పుతుందని అనుకున్న బీఆర్ఎస్.. ఆయన విమర్శలపై స్పందించలేదు. మామూలుగా అలా మాట్లాడితే బీఆర్ఎస్ నేతలు చెలరేగిపోయేవాళ్లు. కానీ వ్యూహాత్మకంగా ఆయన పై సీఎం జగన్ సీరియస్ అయ్యారన్న ఓ లీక్ తో… సరి పెట్టారు.
కానీ పవన్ కల్యాణ్ మాత్రం తెలంగాణ ప్రజల్ని అవమానించిన ఏపీ మంత్రితో పాటు వైసీపీ కూడా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి చర్యలు సమర్థనీయం కాదని అంటున్నారు. అయితే అప్పలరాజు మాట్లాడిన మూడు రోజుల తర్వాత.. అదీ కూడా జగన్ సీరియస్ అయ్యారన్న ప్రచారం జరిగిన తర్వాత పవన్ కామెంట్స్ చేయడంతో సీరియస్ నెస్ తగ్గిపోయిందన్న అభిప్రాయం వినిపిస్తోంది.