సుగాలి ప్రీతి హత్య కేసును సీబీఐ విచారణకు ఇవ్వకపోతే నిరాహార దీక్ష చేస్తానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. రెండు రోజుల కర్నూలు పర్యటనకు వెళ్లిన ఆయన… సుగాలి ప్రీతికి న్యాయం చేయాలంటూ.. భారీ ర్యాలీ నిర్వహించారు. కోట్ల సర్కిల్లో హాజరైన జనంను ఉద్దేశించి ప్రసంగిచారు. 14 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి, చంపారని… దిశ ఘటన జరగకముందే ఈ విషయాన్ని ప్రభుత్వానికి చెప్పినా.. పట్టించుకోలేదని.. పవన్ కల్యాణ్ మండిపడ్డారు. దిశ ఘటన జరిగినప్పుడు హైదరాబాద్‌లో జనాలు ఎలా రోడ్లపైకి వచ్చారో… ప్రీతి ఘటనపై కూడా అందరూ రోడ్లపైకి వస్తేనే న్యాయం జరుగుతుందని ప్రజలకు పిలుపునిచ్చారు. ఎస్టీ బాలికకు అన్యాయం జరిగిపోతే స్పందించని సమాజం మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కర్నూలు జుడీషియల్ క్యాపిటల్ అంటున్నారు… సుగాలి ప్రీతికి న్యాయం జరగకపోతే న్యాయ రాజధాని కట్టినా ప్రయోజనం ఏముందన్నారు.
రాయలసీమ బిడ్డకు అన్యాయం జరిగితే జగన్ ఎందుకు స్పందించడంలేదో చెప్పాలన్నారు. జగన్‌రెడ్డి ఎన్ని చట్టాలు తెచ్చినా… సుగాలి ప్రీతికి న్యాయం జరగనప్పుడు అవన్నీ వ్యర్థమన్నారు. సుగాలి ప్రీతి అంశాన్ని సామాన్యులే తెరపైకి తెచ్చారని… ప్రజల్ని ముందుకు నడిపించే నాయకులే మాకు కావాలని ప్రకటించారు. రాయలసీమ అభివృద్ధిపైనా పవన్ కల్యాణ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నార్సీ, సీఏఏపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలకు అన్యాయం జరిగితే తాను ఊరుకోనన్నారు. దేశపు రక్తపు మూలాల్లోనే సెక్యులర్ భావాలున్నాయి.. ఇస్లాంను భారత్ నుంచి విడదీయలేరని ప్రకటించారు. మతం పేరుతో రాజకీయాలు చేయాలని చూస్తే తిప్పికొట్టాలి పిలుపునిచ్చారు. దేశం అంతా ఆరాధించే క్రికెట్ టీమ్‌కు మైనార్టీని కెప్టెన్‌గా ఎంచుకున్న దేశం మనదన్నారు.
మూడు రాజధానులను పవన్ వ్యతిరేకిస్తున్నారంటూ.. కొంత మంది యువకులు.. ఆందోళన చేస్తే పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. దీంతో పవన్.. మూడు రాజధానుల అంశంపైనా స్పందించారు. హైకోర్టు వస్తే రాయలసీమ అభివృద్ధి చెందుతుందన్న మాటను నమ్మనని స్పష్టం చేశారు. రాయలసీమకు నీళ్లు కావాలి, నిధులు కావాలి.. సమగ్ర రాయలసీమ అభివృద్ధి జరగాలన్నారు. పవన్ కల్యాణ్ పర్యటనను అడ్డుకుంటామంటూ.. కొంత మంది వ్యక్తులు హడావుడి చేశారు. వారికి మీడియా కూడా కవరేజీ ఇచ్చింది. అయితే.. అలాంటి వారంతా కలిపి పది మంది కూడా లేరు. పవన్ పర్యటనకు మాత్రం పెద్ద ఎత్తున యువత తరలి వచ్చారు. గురువారం కూడా ఆయన కర్నూలు జిల్లాలోనే పర్యటిస్తారు.