తిరుమల తిరుపతి దేవస్థానాలపై రమణదీక్షితులు ఆరోపణలు ప్రారంభించి దాదాపుగా రెండు నెలలు దాటుతోంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిన్నటి వరకూ దానిపై ఎలాంటి అభిప్రాయం వ్యక్తం చేయలేదు. కానీ ఒక్కసారి ఇప్పుడు తన దృష్టినంతా… రమణదీక్షితులపైనే కేంద్రీకరించారు. రమణదీక్షితులు లెవనెత్తిన సందేహాలకు ప్రభుత్వం సమాధానాలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు. రమణదీక్షితులు చేస్తానంటున్న ఆమరణ దీక్షకు తన మద్దతు ప్రకటించారు. సీబీఐ విచారణ జరిగే వరకూ.. తన పోరాటం కొనసాగిస్తానని ట్విట్టర్ వేదికగా ఢంకా బజాయించారు. గురువారం ఉదయం శ్రీవారి నగలు విదేశాలకు తరలించడం తనకు తెలుసని ట్వీట్ చేసిన పవన్ సాయంత్రానికి టోన్ మార్చారు. విచారణకు డిమాండ్ చేశారు. రమణదీక్షితులకు తానున్నానని భరోసా ఇచ్చేశారు.
టీటీడీ విషయంలో తెలుగుదేశంతో పాటు వైసీపీ కూడా సైలెంట్‌గా ఉందని.. విషయాన్ని పక్కదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని… పవన్ కల్యాణ్ ట్వీట్లలో చెప్పారు. కానీ రమణదీక్షితులు నేరుగా జగన్‌కు దగ్గరకు వెళ్లిన విషయం పవన్‌కల్యాణ్‌కు తెలిసినట్లు లేదు..! అలాగే నగల విషయంలో పవన్ కల్యాణ్ రమణదీక్షితుల మాటలే పక్కాగా కరెక్ట్ అని నమ్ముతున్నారు. కానీ… గతంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో కూడిన కమిటీలు… అన్ని పరిశీలించి ఇచ్చిన నివేదికల్లో ఏముందో పవన్ కల్యాణ్ తెలుసుకునే ప్రయత్నం చేయలేదు. ఈ వ్యవహారాలన్నీ రమణదీక్షితులుకు బలవంతంగా రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాతే ఎందుకు బయటపెడుతున్నారన్న విషయంపైనా పవన్‌కు ఎలాంటి సందేహం రాలేదు. కానీ.. అలా అడగడం తప్పన్నట్లు చెబుతున్నారు.
టీటీడీ వ్యవహారాలపై పవన్ కల్యాణ్‌కు ఏమైనా అవగాహన ఉందో లేదో.. అర్థం కాకుండా ట్వీట్లు ఉన్నాయి. శ్రీవారి ఆలయంతో పాటు.. ఆభరణాలు కూడా ఇరవై నాలుగేళ్ల పాటు… ఆరోపణలు చేస్తున్న రమణదీక్షితుల అధీనంలోనే ఉన్నాయన్న విషయాన్ని గ్రహించలేకపోయారు. రమణదీక్షితుల వ్యవహారశైలిని.. ఎంతో మంది జేఈవోలు.. ఇతర తిరుమల అధికారులు ఆయన గురించి బయటకు వచ్చి చెప్పారు. చివరికి మెగా కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన నిర్మాత ఎన్వీ ప్రసాద్ కూడా.. తిరుపతిలో నిన్న రమణదీక్షితులు అన్ని అబద్దాలు చెబుతున్నారని…టీటీడీ ప్రతిష్టను దిగజార్చుతున్నారని.. భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా పవన్‌కు రమణదీక్షితుల ఆరోపణలే నిజంగా కనిపిస్తున్నాయి.
అసలు పవన్ కల్యాణ్ ఇన్ని రోజులు ఎందుకు సైలెంట్‌గా ఉండి.. ఇప్పుడే ఎందుకు రమణదీక్షితులను నెత్తికెక్కించుకునే ప్రయత్నం చేస్తున్నారో ఎవరికీ అర్థం కావడం లేదు. రమణదీక్షితులకు సపోర్ట్‌గా నిలవాలన్న సూచనలు తన ఫ్యాన్స్ నుంచి అందాయా లేక..అందరూ కాస్తంత రాజకీయం చేసి పబ్లిసిటీ పొందారు.. తాను ఓ రాయి వేస్తే పోయేదేముందని రంగంలోకి దిగారా అన్నది సస్పెన్స్ గానే ఉంది.