కరోనా వైరస్‌పై పోరాటంలో ఫ్రంట్ లైన్ వారియర్స్‌గా పోరాడుతున్న వారి ప్రాణాలకు గ్యారంటీ లేకపోవడం… వరుసగా ప్రాణాలు కోల్పోతూండటం.. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను ఆవేదనకు గురి చేస్తోంది. అలా ప్రాణాలు కోల్పోతున్న వారి కుటుంబాలకు.. రూ. కోటి పరిహారం ఇచ్చి.. వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ.. లేఖ రాశారు. కరోనా మహమ్మారి పేరు వింటేనే ప్రతి ఒక్కరూ వణికిపోతున్న పరిస్థితులలో.. ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తిస్తున్న వైద్యులు, నర్సింగ్ స్టాఫ్, ల్యాబ్ ఉద్యోగులు, ఆసుపత్రి సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులు… ఇలా ఫ్రంట్ లైన్ వారియర్స్ గా ఉన్న ప్రతి ఒక్కరి సేవలు విస్మరించలేనివని పవన్ కల్యాణ్.. చెబుతున్నారు.
ఈ ఫ్రంట్ లైన్ వారియర్స్‌లో ఆంధ్రప్రదేశ్ లోనే 200 వరకూ వైద్యులు, వైద్య విద్యార్థులు, నర్సింగ్ స్టాఫ్, 600 మంది పోలీసులు కరోనా బారినపడ్డారని తెలుస్తోందన్నారు. ఒక్క పోలీస్ శాఖలో 10 మంది వరకూ కరోనాకు చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాణాలకు తెగించి రోగులకు సేవలందిస్తూ వైద్య ఆరోగ్య సిబ్బంది, ప్రజా సంరక్షణలో పోలీస్, ఇతర విభాగాలు పని చేస్తున్నాయని.. వారి త్యాగాన్ని ప్రభుత్వం గుర్తించాల్సి ఉందన్నారు. కరోనాపై పోరులో ఆ వైరస్ కి బలైన ఉద్యోగుల కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యతను విస్మరించకూడదని ప్రభుత్వానికి హితవు పలికారు. కరోనా కారణంగా మృతి చెందిన వారి కుటుంబాలకు పరిహారంగా రూ.కోటి ఇవ్వాలని… కుటుంబంలో ఒకరికి తక్షణమే ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని డిమాండ్ చేశారు.
అలాగే.. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు పలువురు విధులకు హాజరవుతూ కరోనా బారినపడుతున్నారని వారికి కూడా అండగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. వైద్యానికీ, తదనంతరం తీసుకోవాల్సిన విశ్రాంతికీ నాలుగు వారాల సమయం అవసరం అవుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు కాబట్టి ఈ కాలానికి వేతనంతో కూడిన ప్రత్యేక సెలవులు మంజూరు చేయాలని కోరారు. ప్రభుత్వ ఉద్యోగులతోపాటు ప్రైవేట్ సంస్థల్లో పని చేస్తున్నవారికీ ఈ తరహా సెలవులు అవసరమని.. ప్రైవేట్ సంస్థల నిర్వాహకులు కూడా ఈ విషయంలో సానుభూతితో ఆలోచించాలని పవన్ కోరుతున్నారు. వేతనం కోల్పోతామనే ఆందోళన లేకుండా వారు మానసిక ప్రశాంతతతో త్వరగా కోలుకుంటారన్నారు.
పవన్ కల్యాణ్ ఇంతకు ముందు కూడా ప్రభుత్వానికి అనేక సమస్యలపై లేఖలు రాశారు. కరోనా వల్ల నష్టపోయిన వారిని ఆదుకోవాలని కోరుతూ వస్తున్నారు. కానీ.. ఇంత వరకూ.. ఒక్క సారి కూడా ప్రభుత్వం స్పందించలేదు.