2009లో మొదటి సారి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు పవన్. యువరాజ్యం అధినేతగా ప్రజారాజ్యం అధినేత చిరంజీవిని ముఖ్యమంత్రిని చేయడం అనే లక్ష్యం కోసం ప్రచారం చేశాడు. కానీ పవన్ ప్రచారం పని చేయలేదు. చిరంజీవి ముఖ్యమంత్రి అవ్వలేదు. అధికారంలోకి వచ్చి ఉంటే పవన్ కళ్యాణ్ వ్యవహారం ఎలా ఉండేదో కానీ…ఎన్నికల్లో ప్రజారాజ్యం ఫ్లాప్ అయ్యాక మళ్ళీ ప్రజాక్షేత్రంలో ఎప్పుడూ కనిపించలేదు పవన్. ప్రజా సమస్యలపైన స్పందించింది లేదు. తన సినిమాలు, వ్యక్తిగత జీవితానికే పరిమితమయ్యాడు. మళ్ళీ తెలంగాణా రాష్ట్రం విడిపోయాక 2014లో రీ ఎంట్రీ ఇచ్చాడు. సొంత పార్టీ అన్నాడు. కట్ చేస్తే టిడిపి, బిజెపిలకు సపోర్ట్ ఇచ్చాడు. ఆ పార్టీల గెలుపు కోసం ప్రచారం చేశాడు. ఎన్నికల తర్వాత కూడా ప్రజల తరపున ప్రశ్నిస్తూ ఉంటానన్నాడు. కానీ ఎన్నికలు అయిపోయిన తర్వాత నుంచీ మాత్రం పవన్ తీరు ఏమీ మారలేదు. సినిమా షూటింగ్ గ్యాప్‌లో రాజకీయాలు చేస్తున్నట్టుగా ఉంది కానీ చిత్తశుద్ధి ఉన్నట్టుగా కనిపించడం లేదు. మూడు నాలుగు నెలలకు ఓ సారి ఏదో ఒక ప్రాంతానికి వెళ్ళడం…ఆ ప్రజల సమస్యలపై పోరాడతానని యాభైఏళ్ళకు పైగా మన నాయకులు చెప్పుకుంటూ వస్తున్న డ్రమెటిక్ డైలాగులు చెప్పడం…..ఆ తర్వాత మళ్ళీ అన్నీ మర్చిపోయి సినిమా షూటింగ్స్‌లో బిజీ అయిపోవడం..ఇదీ ప్రస్తుతం పవన్ చేస్తున్న రాజకీయం.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తాజా అప్డేట్ మంత్రివర్గ విస్తరణ. విలువల పతనానికి పరాకాష్ట అనే స్థాయిలో అత్యంత అనుభవజ్ఙుడిని, నిప్పులా బ్రతికినవాడిని అని చెప్పుకునే చంద్రబాబు వైకాపా ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చాడు. ఇకపైన విలువల గురించి మాట్లాడే అర్హత కూడా లేకుండా చేసుకున్నాడు. ఈ విషయంపైన స్పందించని పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్కటి కూడా లేదు. మిత్రపక్షమైన బిజెపి కూడా సన్నాయి నొక్కులు నొక్కింది. ఇక కమ్యూనిస్టులు అయితే ఘాటుగా విమర్శించారు. అలాగే లోక్ సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ కూడా విమర్శలు చేశారు. మరి 2019లో పోటీ చేస్తే…అవకాశం కలిసొస్తే ముఖ్యమంత్రిని కూడా అవుతా అనే స్థాయిలో హింట్స్ ఇస్తున్న పవన్‌కి ఈ విషయంపై స్పందించాల్సిన బాధ్యత లేదా? కెటీఆర్, జగన్‌ల విషయంలో వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకం అని చెప్పిన పవన్ లోకేష్ పట్టాభిషేకం విషయంలో ఎలా స్పందిస్తాడు? రెండు మూడు నెలలపాటు ఫాం హౌస్‌కి, సినిమాలకు పరిమితవడం…ఆ తర్వాత ఏదో ఒక ప్రజా సమస్యను పట్టుకుని నాం కే వాస్తే అన్నట్టుగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అని నాలుగు సినిమా డైలాగులు కొట్టి మళ్ళీ ఫాం హౌస్‌కి, సినిమా షూటింగులకు పరిమితమవడం ఎలాంటి రాజకీయం? బిజినెస్‌లు చేసుకుంటూ ఎంపిలుగా ఉన్న ఎపి నాయకులను పవన్ కళ్యాణ్ ఓ స్థాయిలో విమర్శించాడు. మరి ఇప్పుడు పవన్ చేస్తున్నదేంటి? నీతులు చెప్పడం, నిప్పులా బ్రతుకుతున్నానని ప్రజలను నమ్మించడంలో చంద్రబాబు కంటే ఎక్కువగా సక్సెస్ అవుతున్నాడు పవన్. కానీ చేతల్లోనే శూన్య హస్తం మిగులుస్తున్నాడు. 2009 నుంచి 2017వరకూ పవన్ చేసిన రాజకీయం అదే. ఇక రాబోయే ఒక్క ఏడాదిలో కూడా పవన్ చేసేది ఏమీ ఉండదు అని ప్రత్యేకంగా చెప్పాలా? అధికారంలో ఉన్న చంద్రబాబు చేస్తున్న తప్పులకు వ్యతిరేకంగా మాట్లాడడానికే భయపడే పవన్ ప్రజలకు ఏం ఒరగబెడతాడు? ప్రజల తరపున ఏం ప్రశ్నిస్తాడు?