రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత పవన్ కల్యాణ్‌లో ఆవేశం కనిపించింది కానీ అది ఎప్పుడూ రాజకీయంగా .. రాజకీయ ప్రత్యర్తులపై విరుచుకుపడేలా లేదు. పాలసీలపై ఆవేశంగా ప్రశ్నించడం.. ప్రజాసమస్యలపై ప్రభుత్వాలను నిలదీయడం వరకే ఉంది. కానీ తొలి సారి పవన్ కల్యాణ్.. ఉగ్రరూపం చూపించారు. వైఎస్ఆర్సీపీ నేతలపై విరుచుకుపడ్డారు. ఓ సందర్భంగాలో చెప్పు చూపించి మరీ .. హెచ్చరికలు జారీ చేశారు. మంగళగిరిలోని పార్టీ ఆఫీసులో జరిగిన సమావేశంలో పవన్ కల్యాణ్ ఒక్క సారిగా ఉగ్రరూపం చూపించారు. రెండు, మూడు రోజులుగా లేని కోపం ఆయనలో మమంగళవారం కనిపించింది.
తనపై వ్యక్తిగత విమర్శలు మాత్రమే చేస్తున్న వారికి … అదే రేంజ్లో కౌంటర్ ఇచ్చారు. ప్యాకేజీ స్టార్ అనే వెధవల్ని చెప్పుతో కొడతానని చెప్పు చూపించి మరీ పవన్ హెచ్చరించారు. ప్యాకేజీ అనే సన్నాసుల్లారా మెడ పిసికి చంపేస్తానని, తప్పుడు ఆరోపణలు చేస్తే ఇకపై ఊరుకునేది లేదని మండిపడ్డారు. ఇంతకాలం మిమ్మల్ని రక్షించింది మా సహనం అని, మమ్మల్ని తిట్టే ప్రతి వ్యక్తి తోలు ఒలిచేస్తానని పవన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మాట్లాడితే మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నానంటున్నారని, ‘మీరూ చేసుకోండ్రా.. ఎవడొద్దన్నారు?’ అని వైసీపీ నేతలను ఉద్దేశించి పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. వైసీపీలో ఉన్న కాపు నేతలు జగన్ ను పొగడుకోవచ్చు కానీ..కాపు కులాన్ని తక్కువ చేయవద్దని మండిపడ్డారు.
‘వెధవల్లారా ఒక్కొక్కడ్ని ఇంట్లోంచి బయటికి లాక్కొచ్చి కొడతా’ అని తీవ్రమైన పదజాలంతో మండిపడ్డారు. ‘‘నాకు రాజకీయం తెలియనుకుంటున్నారా? ఒక్కొక్కర్నీ నిలబెట్టి తోలు ఒలుస్తా, చెప్పుతో కొడతా కొడకల్లారా!’’ అంటూ రెచ్చిపోయారు. ప్రసంగం మొదటి నుంచి చివరి వరకూ పరుష పదజాలం వాడుతూ వైఎస్ఆర్ సీపీ నేతలపై విరుచుకుపడ్డారు. తాను మూడు పెళ్లిళ్లు చేసుకున్నా విడాకులు ఇచ్చి, వారికి తన ఆస్తులు కూడా ఇచ్చి మరొకర్ని పెళ్లి చేసుకున్నానని అన్నారు. వైఎస్ఆర్ సీపీ నాయకుల మాదిరిగా ఒకర్ని పెళ్లి చేసుకొని 30 మందితో తిరగడం లేదని అన్నారుఇప్పటిదాకా అందరూ పవన్ కల్యాణ్ లోని మంచితనాన్నే చూశారని, ఇకపై తన నుంచి తమ నుంచి యుద్ధమే చూస్తారని తేల్చి చెప్పారు. ఈ స్ఫూర్తి తనకు తెలంగాణ పోరాటం నుంచి వచ్చిందని చెప్పారు. తన తండ్రి కూడా అప్పట్లో మంగళగిరి పోలీస్ స్టేషన్లోనే కానిస్టేబుల్ గా పని చేశారని గుర్తు చేసుకున్నారు. వైఎస్ఆర్ సీపీ నేతలకు మంచిగా చెప్తే వినపడదని అన్నారు
. ‘లండన్, న్యూయార్క్‌లో పెరిగాననుకుంటున్నారా? బాపట్లలో పుట్టా.. గొడ్డు కారం తిని పెరిగా’నన్నారు. ‘వైసీపీతో నేను యుద్ధానికి సిద్ధం.. రాడ్లతోనా.. హాకీ స్టిక్కులతోనా.. దేంతోనైనా రండి తేల్చుకుందాం.. నేటి నుంచి యుద్ధమే.. మీరు రెడీనా’ అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ సై అంటే సై అన్నారు. పవన్ కల్యాణ్‌లో ఇంత ఆవేశం చూడని కార్యకర్తలు కూడా .. ఆయన ప్రసంగం విన్నంత సేపు.. హర్షధ్వానాలు చేస్తూనే ఉన్నారు.