అధికారంలోకి వచ్చామని వైసీపీ చేసిన తప్పులు చేయకూడదని జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. పార్టీ తరపున గెలిచిన వారికి కార్యాయంలో సన్మానం చేశారు. ఈ సందర్భంగా సుదీర్ఘంగా ప్రసంగించారు. గత ప్రభుత్వంలో జరిగిన తప్పులు మళ్లీ మనం చేయకూడదని.. వైసీపీ నాయకులు మనకి శత్రువులు కాదు. కేవలం రాజకీయ ప్రత్యర్ధులు మాత్రమేనని వారి విధానాల మీదనే మన పోరాటం ఉండాలని సూచించారు. ఈ సందేశాన్ని ప్రతి ఒక్కరు లోతుగా అర్ధం చేసుకోవాలని కోరారు.
గత ప్రభుత్వ హయాంలో పెట్టిన అడ్డగోలు ఖర్చులు, నిధులు వినియోగం చూస్తుంటే గుండె తరుక్కుపోతుందన్నారు పవన్. రూ. 200 కోట్లు ఖర్చు పెడితే ఎంతో మందికి ప్రయోజనం చేకూర్చే ఎన్నో పథకాలను పాలకులు వదిలేశారు. రూ. 600 కోట్లు ఖర్చు చేసి రుషి కొండ ప్యాలెస్ ను ఏ కారణం చేత కట్టారో కూడా తెలియదన్నారు. నాదెండ్ల మనోహర్ తనిఖీలు చేస్తుంటే పేదలకు వెళ్ళే బియ్యాన్ని ఎలా తరలించేస్తున్నారో, అదెంత మాఫియానో ప్రజలకు తేటతెల్లం అయిందని గుర్తు చేశారు. ప్రజా ప్రతినిధులు అధికార దుర్వినియోగం చేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. రాజకీయాలను సంస్కరించాలి అని వచ్చిన మనమే సంస్కార హీనులుగా మారకూడదని. దీనిపై పార్టీ క్రమశిక్షణ కమిటీకి పూర్తి బాధ్యతలు అప్పగిస్తున్నానన్నారు.
టీడీపీ, బీజేపీ నాయకులను ఏ మాత్రం తగ్గించి మాట్లాడవద్దని స్పష్టం చేశారు. ప్రభుత్వంలో ఉన్న నామినేటెడ్ పదవులకు అనుగుణంగా కూటమి పార్టీల మధ్య పంపకాలు ఉంటుంది కాబట్టి దానికి అనుగుణంగా నాయకులకు పదవులు కట్టబెడతామని స్పష్టం చేశారు. కొందరికి ప్రభుత్వ పదవులు, మరికొందరికి పార్టీలో ఉన్నతస్థాయి పదవులు అందచేస్తామన్నారు. ఉన్న అవకాశాలను బట్టి పదవులు దక్కుతాయని అర్ధం చేసుకోవాలని కోరారు. పార్టీ నుంచి ఎన్నికయిన ఎమ్మెల్యేలు వారానికి ఒక్కరు చొప్పున పార్టీ కేంద్ర కార్యాలయంలో అందుబాటులో ఉండాలి. ప్రజలు అందించే వినతులను స్వీకరించి వారితే ప్రత్యేకంగా మాట్లాడాలని సూచించారు