ఆర్కే బీచ్ ఉద్యమం… ఆంధ్రులందరూ మరచిపోలేని సందర్భం ఇది. ఎందుకంటే, ప్రత్యేక హోదా ఉద్యమానికి కొన్ని రూపురేఖలంటూ ఛాయామాత్రంగానైనా మొదలైన అక్కడే. ఎందుకంటే, అంతకముందు జరిగిందంతా ఊకదంపుడు వ్యవహారమే. ఆ సందర్భంలోనే ప్రత్యేక హోదా ఉద్యమాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పూర్తి స్థాయిలో ఆత్మీకరించుకున్నారేమో అని అందరూ అనుకున్నారు. విశాఖలో జరిగిన నిరసన కార్యక్రమానికి పవన్ మద్దతు ఇచ్చారు. దీంతో యువతలో ఉత్సాహం రెట్టించింది. ఆర్కే బీచ్ కి పవన్ వచ్చేస్తారేమో అనే రేంజిలో ప్రచారం కూడా జరిగింది. కానీ, అప్పుడు కూడా కేవలం ట్వీట్లకు మాత్రమే తన పోరాటం పరిమితం అవుతుందని మరోసారి నిరూపించుకున్నారు. ఇదంతా జనవరి నెలలో జరిగిన తతంగం. ఆ తరువాత, మార్చి నెల ఉంటుందీ… ఆ నెలలో ఆర్కే బీచ్ లో దీక్షకు దిగుతానంటూ అప్పుడే పవన్ ప్రకటించిన సంగతి… ఆయన మరచిపోయారేమోగానీ, ఏపీ ప్రజలకు ఇంకా గుర్తుంది.
మార్చి నెల దాటేసి చాలారోజులైంది. ఏప్రిల్ కూడా సగం అయిపోయింది. కానీ, ఇంతవరకూ ప్రత్యేక హోదా ఉద్యమంపై ఎలాంటి కార్యాచరణా ప్రకటించలేదు. నిజానికి, జనవరి తరువాత ప్రత్యేక హోదా ఇష్యూ మీద పవన్ స్పందించిందీ లేదు. ఓసారి, తుందుర్రు ఆక్వా రైతుల కష్టాలపై స్పందించారు. ఆ తరువాతేమో, అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరగాలంటూ స్పందించారు. పోనీ.. ఈ విషయంలోనైనా చివరికంటూ పోరాడారా అంటే, అదీ లేదు. ఈ మధ్యనే.. ఉత్తరాది ఆధిపత్యం అంటూ ఓ ట్వీట్ చేశారు. పోనీ, ఆ ఆధిపత్యంపై పోరాటమేంటో, ఎలా చేస్తున్నారో కూడా చెప్పలేదు. ఇలా ఎక్కడ ఎత్తిన కాడెను అక్కడే దించేస్తున్నారు. ఈ క్రమంలో ప్రత్యేక హోదా ఉద్యమం… మార్చి నెలలో విశాఖ బీచ్ లో కార్యక్రమం అనేది ఆయనకి గుర్తులేకుండా పోయింది.
కుదిరితే ఒక ట్వీట్… ఇంకాస్త తీరిక దొరికితే ఒక ప్రెస్ మీట్.. ఇంతకుమించి జనసేన చేపట్టిన ప్రత్యేక హోదా ఉద్యమం ఎక్కడైనా ఉందా..? ఎంతసేపూ… వాళ్లు స్పందించాలీ, వీళ్లు కలిసి రావాలీ అంటూ ట్వీటుతారే తప్ప… పంచె ఎగ్గట్టి పవన్ బరిలోకి దిగిన సందర్భం ఏది..? మార్చిలో ఉద్యమం చేస్తానని అప్పుడెప్పుడో ప్రకటించారు. ఏప్రిల్ దాటుతున్నా ఆ మాటకు దిక్కూ దివాణం లేకుండా పోయింది. అంటే, ఆ ప్రకటనకు విలువ లేదా..?
పవన్ తీరు చూస్తుంటే… వచ్చే ఎన్నికల వరకూ ఇదే అంశాన్ని వాయిదా వేస్తూ పోయేట్టుగా ఉన్నారు. తీరా ఎన్నికల సీజన్ వచ్చేసరికి… అప్పట్లో వారు పోరాడ లేదూ, వీరు పోరాడ లేదంటూ ఇతర పార్టీలనూ నాయకుల తీరుపై ప్రశ్నిస్తారేమో..? ఈ క్రమంలో ప్రత్యేక హోదా కోసం జనసేన చేసిందేముంది అనే ఆత్మ విమర్శ చేసుకున్నా పెద్దగా ఒరిగేదేముంటుంది..? హోదా విషయంలో తెలుగుదేశం ఎంపీల తీరుకు సమానంగానే పవన్ కల్యాణ్ వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రకరకాల సాకులు చూపుతూ ఏపీకి ఇచ్చిన హామీలను కేంద్రం తుంగలోకి తొక్కుతుంటే.. టీడీపీ ఎంపీలు ప్రేక్షకులుగా లాబీల్లో కూర్చుని ఉండిపోయారు. పవన్ కల్యాణ్ తీరూ అంతే.. జరగాల్సిందంతా జరుగుతూ ఉంది. అదిగో ఇదిగో అంటూ ఊరిస్తున్నారే తప్ప.. ఉద్యమించింది లేదు.
ప్రత్యేక హోదా రాకపోవడం వల్ల ప్రజల నుంచీ వ్యతిరేకత అంతా తెలుగుదేశంపై పడకుండా… టాపిక్ ను డైవర్ట్ చేయడం కోసమే ఈ ఉద్యమాన్ని పవన్ భుజానికి ఎత్తుకున్నట్టుగా ఉంది. హోదా ఉద్యమాన్ని ఓన్ చేసుకోవడం వెనక జనసేన అసలు కారణం ఇదే అనేది ప్రజల నుంచి మెల్లమెల్లగా వ్యక్తమౌతున్న అభిప్రాయం.