జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎప్పుడూ కూడా సంజాయిషీలు చెప్పుకొంటూనే ఉంటారు. ఆయన రాజకీయాలలోకి ఎందుకు రావాలనుకొన్నారో, పార్టీ స్థాపించినా ఎన్నికలలో ఎందుకు పోటీ చేయడం లేదో, ప్రశ్నిస్తానన్నపెద్ద మనిషి ఎందుకు ప్రశ్నించడం లేదో, తుళ్ళూరులో రైతుల తరపున పోరాడేందుకు వస్తానని చెప్పి ఎందుకు మాయం అయిపోయాడో, ప్రత్యేక హోదా గురించి ఎందుకు మౌనం వహిస్తున్నారో ఇలాగ వరుసబెట్టి దేనికో దానికి ఆయన సంజాయిషీలు చెప్పుకొంటూనే ఉన్నారు. మళ్ళీ నిన్న కూడా ఆయన మరొకమారు సంజాయిషీ చెప్పుకొన్నారు. ప్రత్యేక హోదా కోసం ఆత్మహత్య చేసుకొన్న మునికోటి మృతికి ట్వీటర్ ద్వారా సంతాపం తెలిపిన తరువాత, “నేను ప్రత్యేక హోదా గురించి మాట్లడాలనుకొంటున్నప్పటికీ, పరిస్థితులను చూసి నన్ను నేను నిగ్రహించుకొంటున్నాను,” అని ట్వీట్ చేశారు. కానీ ఎందుకు నిగ్రహించుకోవలసి వస్తోందో కారణాలు చెప్పలేదు.
ప్రత్యేక హోదా కోసం పోరాడేందుకు ముందుకు రమ్మని ఆయన సహా నటుడు శివాజీ చాలా కాలంగా కోరుతున్నారు. చివరికి అధికార పార్టీకి చెందిన ఎంపీలు రాయపాటి సాంభశివరావు, జేసీ దివాకర్ రెడ్డి వంటివారు సైతం పవన్ కళ్యాణ్ ముందుకు వస్తే ఆయన నాయకత్వంలో పోరాడేందుకు సిద్దంగా ఉన్నామని చెపుతున్నారు. రాష్ట్రంలో తెదేపా, బీజేపీలు తప్ప మిగిలిన అన్ని రాజకీయపార్టీలు, ఉద్యోగ సంఘాలు కూడా ప్రత్యేక హోదా కోసం పోరాటాలు మొదలుపెట్టాయి. అటువంటప్పుడు పవన్ కళ్యాణ్ ఇంకా తనను తాను నిగ్రహించుకొంటున్నానని చెప్పడం ప్రజలను మభ్య పెట్టడానికేననే అనుమానం కలుగుతోంది.
తెదేపా, బీజేపీలతో తనకున్న అనుబంధం, సంబందాలు దెబ్బ తినకూడదనే ఉద్దేశ్యంతోనే ఆయన నిగ్రహించుకొంటున్నరేమో తప్ప వేరే కారణాలు కనబడటం లేదు. అయినా తను స్వయంగా పోరాడలేనప్పుడు ఇతరులను విమర్శించడం కూడా అనవసరం. కానీ తెదేపా, బీజేపీ ఎంపీలు తమ వ్యాపారాల మీద చూపుతున్నంత శ్రద్ద ప్రత్యేక హోదా తదితర అంశాలపై చూపించడం లేదని విమర్శలు చేసారు. అప్పుడే వారితో ఆయన సంబంధాలు దెబ్బతిన్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారందరినీ నియంత్రించడం వలన వారు వెనక్కి తగ్గారు లేకుంటే పవన్ కళ్యాణ్ ఈపాటికి వారితో యుద్ధం చేస్తుండవలసి వచ్చేది. అటువంటప్పుడు ఇంకా ఆయన తెదేపా, బీజేపీలతో తన సంబంధాలను కాపాడుకోవాలనుకోవడం దేనికో తెలియదు.
తెదేపా బీజేపీ ఎంపీలు రాష్ట్ర విభజన ప్రయోజనాల కోసం పోరాడకుండా తమ వ్యాపారాలపైనే దృష్టి పెడుతున్నారని విమర్శించిన పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు అదే పనిచేస్తున్నారని చెప్పవచ్చును. ఆయన రాష్ట్రం కోసం పోరాడవలసిన సమయం వచ్చినప్పటికీ తెదేపా, బీజేపీలతో తన సంబంధాలను కాపాడుకోవాలనుకోవడం కోసమే తనను తాను నిగ్రహించుకోవలసిన అవసరం ఏముంది? వారు వ్యాపారాలు చేసుకొంటుంటే ఆయన సినిమాలు చేసుకొంటున్నారు. వారు మోడీతో తమ సంబంధాలు చెడిపోకుండా జాగ్రత్త పడుతుంటే, పవన్ కళ్యాణ్ తెదేపా, బీజేపీలతో తన సంబంధాలు చెడిపోకుండా జాగ్రత్తపడుతున్నట్లుంది. అందుకే ఆయన తనను తాను నిగ్రహించుకొంటున్నారేమో? ఆయన స్వయంగా పోరాడకపోయినా తన సహ నటుడు శివాజీ చేస్తున్న పోరాటానికి మద్దతు ఇవ్వకపోవడానికి కూడా ఇదే కారణమయి ఉండవచ్చును.
మన సినీ పరిశ్రమలో ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్ తేజ్ వంటి నటులు చాలా మందే ఉన్నారు. కానీ వారెవరినీ ప్రజలు కానీ, రాజకీయ పార్టీలు గానీ నిలదీయడం లేదు. ఎందుకంటే వారెవరూ కూడా పవన్ కళ్యాణ్ లాగ రాజకీయపార్టీ స్థాపించ లేదు. ఏదో సాధించి చూపిస్తామని చెప్పుకోలేదు. వారు తమ సినిమాలకే పరిమితమయ్యారు కనుక వారినెవరూ తప్పు పట్టడం లేదు. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఆర్భాటంగా జనసేన పార్టీని స్థాపించి గొప్పలు ప్రశ్నిస్తానని చెప్పుకొని కనీసం ఇప్పుడు ఆ చిన్న పని కూడా చేయకపోవడం వలననే అందరూ ఇప్పుడు ఆయననే తిరిగి ప్రశ్నించాల్సి వస్తోంది. జనాలు ఆయననే ప్రశ్నించడం మొదలుపెట్టినప్పుడు ఆయన ఇలాగ సంజాయిషీలు చెప్పుకోవలసివస్తోంది. ఆయన ముందు రెండు మార్గాలున్నాయి. 1. సినిమాలు విడిచిపెట్టి ప్రత్యక్ష రాజకీయాలలోకి రావడం. 2. రాజకీయాలకు నమస్కారం పెట్టేసి సినిమాలలోనే కొనసాగడం. ఆయన రెండు పడవలలో కాళ్ళు పెట్టి సాగాలనుకొంటే ఇటువంటి ఇబ్బందులు, విమర్శలు ఎదుర్కోక తప్పదు.