నేను ఆర్థికంగా చిదిగిపోయా..
స్టాఫ్‌కి జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బుల్లేవు..
అంటూ.. మాట్లాడిన పవన్నిచూస్తే కోట్లాది మంది ఆయన అభిమానులకు ఆశ్చర్యంతో కూడిన సందేహం. పవన్ దగ్గర డబ్బులు లేకపోవడం ఏమిటి? సినిమాకి రూ.20 కోట్లు తీసుకొనే కథానాయకుడు ఆయన. ‘అత్యధిక పారితోషికం తీసుకొనే హీరోని నేనే’ అని స్వయానా పవనే చెబుతున్నాడు. సర్దార్ గబ్బర్ సింగ్ కోసం పవన్ రూ.30 కోట్లు తీసుకొన్నాడని టాలీవుడ్ సైతం కోడై కూస్తోంది. గోపాల గోపాల ఎకౌంట్లో రూ.9 కోట్ల వరకూ పడ్డాయని చెబుతున్నారు. అత్తారింటికి దారేదికి రూ.15 కోట్ల వరకూ అందుకొన్నాడు. అంటే… గత మూడు సినిమాలతోనే దాదాపుగా రూ.50 కోట్లకుపైగా ఆర్జించాడు. అయినా సరే.. ఈ బీద అరుపులేంటి?? అనేది అభిమానుల సందేహం.
అయితే పవన్ మాటల వెనుక ఓ స్ట్రాటజనీ ఉందని సినీ, రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ తరపున వకాల్తా పుచ్చుకొని మాట్లాడి, వైఎస్సార్సీపీకి వెళ్లాల్సిన ఓట్లని చీల్చి.. టీడీపీని గద్దెనెక్కించే కార్యక్రమంలో సఫలీకృతమైన పవన్‌కి ఆ రూపేణా రూ.500 కోట్ల వరకూ ప్యాకేజీ అందిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ”అలాంటి ప్యాకేజీలేం నా వరకూ రాలేదు” అని పవన్ స్ట్రయిట్‌గా చెప్పకుండా ఇలా డొంకతిరుగుడుగా మాట్లాడుతున్నాడా?? అంటూ గుసగుసలాడుకొంటున్నారు. అయితే మరోవైపు రేణూ దేశాయ్‌ని వదిలించుకోవడానికి విడాకులు ఇచ్చి, భరణంగా రూ.50 కోట్ల వరకూ ముట్టజెప్పాడని.. ఆ సమయంలోనే బాగా అప్పుల పాలైపోయాడని పవన్ గురించి తెలిసినవాళ్లు చెబుతున్నారు. అయితే.. పవన్‌ని దేవుడిగా భావించి పూజలు చేసే అభిమాన భక్తులు మాత్రం… ‘దేవుడికి డబ్బులెందుకు’ అంటూ కొటేషన్లు చెబుతున్నారు. పవన్ ఇంటర్వ్యూల జాతర ఎన్నో ప్రశ్నలకు, సందేహాలకు తెర తీసింది. అందులో ప్రశ్నలే తప్ప.. సమాధానాలు కనిపించడం లేదు. పవన్ బీద అరుపులు కూడా ఆ బాపతే.