గత నెలలో జనసేన ఆవిర్భావ సభ సందర్భంగా తనకు భద్రత కల్పించాలంటూ పవన్ కల్యాణ్ ఓ లేఖ రాశారు. దానికి అనుగుణంగా నలుగురు గన్ మేన్లను ప్రభుత్వం నియమించింది. అయితే, ఇప్పుడా నలుగురినీ పవన్ కల్యాణ్ వెనక్కి పంపించేయడం విశేషం. తనకు గన్ మెన్ అవసరం లేదని చెప్పి పంపితే ఒకలా ఉండేది. కానీ, భద్రతా సిబ్బంది ద్వారా తనపై ప్రభుత్వం నిఘా వేసిందని పవన్ అభిప్రాయపడ్డట్టు సమాచారం. తన ప్రతీ కదలికల్నీ గమనించి, భద్రతా సిబ్బంది ద్వారా తన వ్యూహాలను ప్రభుత్వం తెలుసుకునే ప్రయత్నం చేస్తోందన్న విశ్వాసంతో వారిని పవన్ వెనక్కి పంపేశారని తెలుస్తోంది.
వాస్తవం మాట్లాడుకుంటే… గన్ మెన్ ని వెనక్కి పంపించినంత మాత్రాన ప్రభుత్వానికి సమాచారం అందకుండా పోతుందా చెప్పండి. ప్రభుత్వానికి ఇంటిజెన్స్ అనేది ఒకటి ఉంటుంది. అదే చెవులూ కళ్లు. రాజకీయంగానీ, లేదా ఇతర అంశాలకు సంబంధించిన సమాచారాన్నిగానీ ఆయా వర్గాల ద్వారా ముందుగా ప్రభుత్వానికి సమాచారం అందుతుందనేది అందరికీ తెలిసిందే. ఒకవేళ పవన్ ప్రతీ కదిలికా ప్రభుత్వం తెలుసుకోవాలనుకుంటే… గన్ మెన్ ల మీద మాత్రమే ఆధారపడుతుందని అనుకుంటే ఎలా..? ప్రభుత్వానికి చాలా మార్గాలుంటాయి.
అయితే, రాజకీయాల్లో ఇలాంటివి సర్వసాధారణమైన విషయాలు. అధికార పార్టీలు ఏవైనాసరే తమకున్న అడ్వాంటేజ్ లకు అనుగుణంగా కీలక నేతలకు సంబంధించిన కదలికల్ని గమనిస్తుందనేది వాస్తవం. గతంలో, అంటే.. కేంద్రంలో చంద్రశేఖర్ ప్రభుత్వం ఉన్న రోజుల్లో ఇలాంటి కారణం చూపించే రాజీవ్ గాంధీ మద్దతు ఉపసంహరించుకున్నారు. ‘మా ఇంటి దగ్గర ఒక కానిస్టెబుల్ ని పెట్టారనీ, తనకు సంబంధించిన సమాచారం తెలుసుకుంటున్నారనీ, తన దయతో ప్రభుత్వం నడుస్తుంటే.. కానిస్టెబుల్ తో నాపైనే నిఘా పెట్టిస్తారా’ అంటూ రాజీవ్ గాంధీ ఆగ్రహించారు. ఫలితంగా ఎన్నికలు వచ్చాయి. అంటే, నాయకులపై నిఘా పెట్టించడం అనేది కొత్త వ్యవహారం కాదు. పవన్ కల్యాణ్ రాజకీయాలకు కొత్త కాబట్టి, ఈ స్థాయిలో స్పందించేస్తున్నారని అనుకోవాలి. ఇన్నాళ్లూ కేంద్రం, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలకు పవన్ అండగా ఉండేవారు, కాబట్టి ఇలాంటి పరిస్థితి ఎదురు కాలేదు. ఇప్పుడు ఎదురు తిరిగేసరికి.. పరిస్థితి మారింది. రాజకీయాల్లో ఇవన్నీ పార్ట్ ఆఫ్ ద గేమ్ అని పవన్ తెలుసుకోవాలి.