‘ప్రజా జీవితంలో ఉన్నప్పటికీ సినిమా నాకు అన్నం పెట్టింది. సినిమా లేకపోతే ప్రజాసేవలో ఉండే అవాకాశం వుండేది కాదు” అన్నారు పవన్‌కల్యాణ్. ‘భీమ్లా నాయక్’ ప్రీరిలీజ్ వేడుక హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. తెలంగాణ మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్‌యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ వేడుకలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ..,‘‘ నేను జన జీవితంలో ఉన్నా కానీ, సినిమానే అన్నం పెట్టింది. సినిమా లేకపోతే ప్రజలసేవలో ఉండేవాడిని కాదు. సినిమా ఇంత అభిమానులను నాకు భిక్షగా ఇచ్చింది. ఇంతమంది నన్ను గుండెల్లో పెట్టుకునేలా చేసింది. ఏదో అయిపోదామని ఎప్పుడూ అనుకోలేదు. సమాజానికి ఎంతో కొంత మంచి చేయాలని వచ్చా”అని చెప్పుకొచ్చారు
‘అహంకారానికి, ఆత్మగౌరవానికి ఒక మడమ తిప్పని యుద్ధం’ భీమ్లా నాయక్ లో చూస్తారు. ఒక పోలీస్ ఆఫీసర్‌కు, రాజకీయ నేపథ్యం ఉన్న వ్యక్తికి మధ్య జరిగే సంఘర్షణ. ఈ సినిమాకి స్క్రీన్ ప్లే చేసిన త్రివిక్రమ్ కి ధన్యవాదాలు. ఆయన లేకపోతే ఈ సినిమా లేదు. ఈ సినిమాలో నటించిన రానా, సంయుక్త మేనన్, నిత్యామేనన్ చాలా చక్కగా నటించారు. దర్శకుడు సాగర్ చంద్రకి అభినందనలు. తెలుగు చిత్ర పరిశ్రమ పట్ల తెలంగాణ ప్రభుత్వం సహకారానికి కృతజ్ఞతలు’ అని చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్.