తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ మద్దతు ప్రకటించారు. న్యాయబద్ధమైన డిమాండ్ల కోసం సమ్మె చేస్తున్న వారికి ఏకపక్షంగా తొలగించడం కరెక్ట్ కాదని పవన్ కల్యాణ్ అంటున్నారు. డిమాండ్ల సాధనకు ఉద్యోగులు చేసే ఆందోళనలను .. సానుభూతితో పరిశీలించాలే తప్ప కఠినమైన నిర్ణయాలు తీసుకోవద్దని తెలంగాణ ప్రభుత్వాన్ని పవన్ కోరారు. సకల జనుల సమ్మెలో భాగంగా 17 రోజులపాటు .. ఆర్టీసీ ఉద్యోగులు సమ్మెచేసి ఉద్యమానికి అండగా ఉన్నారని గుర్తు చేశారు. ఆనాడు కార్మికులు చేసిన త్యాగాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఆర్టీసీ కార్మికులతో ప్రభుత్వం చర్చలు జరిపి… చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని కోరుతున్నానన్నారు. ప్రజలకు కష్టం కలగకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలంటూ.. సమ్మెకు వెళ్లిన ఆర్టీసీ ఉద్యోగులపై కేసీఆర్ వేటు వేశారు. ఆర్టీసీలో 1200 మంది తప్ప అసలు ఉద్యోగులే లేరని ప్రకటించారు. అందర్నీ ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నట్లుగా తేల్చేశారు. కొత్తగా నియామకాల కోసం సన్నాహాలు చేస్తున్నారు. ఈ క్రమంలో కార్మికులకు విపక్ష పార్టీలు , ప్రజాసంఘాలు మద్దతుగా నిలుస్తున్నాయి. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్… ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేస్తానని మాటిచ్చారని గుర్తు చేస్తున్నారు.
ఇప్పుడు ప్రైవేటీకరణ కోసమే.. సమ్మెపై ఉక్కుపాదం మోపుతున్నారని అంటున్నారు. అయితే.. తెలంగాణ సీఎం మాత్రం.. ఉద్యోగులను ఇక ఆర్టీసీలోకి తీసుకునే చాన్సే లేదని చెబుతున్నారు. కొత్తగా సగం అద్దెబస్సులు తీసుకోవడానికి.. కొత్త నియామకాల కోసం.. ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఈ క్రమంలో ఆందోళనను ఉద్ధృతం చేయాలని ఆర్టీసీ కార్మికులు భావిస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణలో ఆర్టీసీ సమ్మె నేపధ్యంగా కీలకమైన పరిణామాలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి.