జనసేన అధినేత పవన్ కల్యాణ్ అమరావతికి తన మద్దతును మరోసారి ప్రకటించారు. రెండు రోజుల పార్టీ సమావేశాల కోసం విజయవాడ వెళ్లిన పవన్ కల్యాణ్.. అమరావతి రైతులు, మహిళలతో సమావేశమయ్యారు. బీజేపీతో పొత్తు పెట్టుకున్నప్పుడే అమరావతిని రాజధానిగా నిర్ణయించామని ఆ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పలువురు మహిళలు కన్నీరు పెట్టుకున్నారు. భూములిచ్చి మానసిక క్షోభ అనుభవిస్తున్నామని బోరుమన్నారు. వారి ఆవేదన చూసి పవన్ కల్యాణ్ చలించారు. ఎప్పుడూ బయటకురాని ఆడవాళ్లు రోడ్లపైకి వచ్చారని.. లాఠీఛార్జీలు, బేడీలను భరిస్తూ ఉద్యమం చేస్తున్నారన్నారు. దళితులపైనే ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టే స్థాయికి ప్రభుత్వం దిగజారిందని మండిపడ్డారు. 2014లో అమరావతికి జగన్ అంగీకారం తెలిపారని.. అందరి అంగీకారంతోనే రాజధాని ఏర్పాటైందన్నారు.
29 వేల మంది రైతులు భూములు ఇస్తే.. ఇప్పుడు కులాలు, రాజకీయాలు అంటగడుతున్నారని విమర్శించారు. రాజధాని ఇక్కడే ఉంటుందని బలంగా నమ్ముతున్నానన్నారు. దాదాపుగా ఎనిమిది నెలల తర్వాత పవన్ కల్యాణ్ అమరావతి వైపు చూశారు. ఈ మధ్య కాలంలో కరోనా కష్టాలు..వేధింపులను ఎదుర్కొని ఎన్నో ఉద్యమాలు చేశారు. నిర్బంధాలు ఎదుర్కొన్నారు. కానీ పవన్ కల్యాణ్ ఎప్పుడూ గట్టిగా నిలబడలేదు. కనీసం మద్దతు ప్రకటనలు కూడా.. చేయలేదు. దళిత రైతుల్ని అట్రాసిటీ కేసుల కింద అరెస్ట్ చేసినప్పుడు కూడా స్పందించలేదు. ఇప్పుడు.. అమరావతికి వచ్చి పోలీసులపై మండిపడ్డారు. రైతులకు అండగా ఉన్నారనే భావన కల్పించాలంటే.. ఎప్పుడో ఓ సారి వచ్చి ప్రకటన చేస్తే సాధ్యం కాదు.
ఇప్పటికే బీజేపీ .. అమరావతినే రాజధాని అని చెబుతూ.. మరోవైపు జగన్ నిర్ణయాలను సమర్థిస్తూ.. తమను దారుణంగా మోసం చేస్తోందన్న అభిప్రాయంలో ఉన్నారు. బీజేపీతో కలిసి పవన్ కూడా ఆ మోసంలో భాగస్వామి అనే అనుమాన బీజాలు వారిలో ప్రారంభమయ్యాయి. వాటిని తొలగించుకోవడానికి ఈ మీటింగ్ సరిపోకపోవచ్చు.. మరింత ఉద్ధృతంగా రైతుల కోసం జనసేనాని చర్యలు తీసుకోవాల్సి ఉంది.