తమిళనాడులో జల్లికట్టు ఉద్యమ స్ఫూర్తితో ఏపీలో ప్రత్యేక హోదా స్వరం పెరిగిన సంగతి తెలిసిందే. గత నెల 26న విశాఖ బీచ్ లో నిరసన కార్యక్రమానికి ఆంధ్రా యువత పిలుపు నివ్వడం.. దానికి వైకాపాతోపాటు, జనసేన కూడా మద్దతు ప్రకటించడం.. కొన్ని నాటకీయ పరిణామాలు చోటుచేసుకోవడం జరిగింది. అయితే, విశాఖలో జరిగిన కార్యక్రమానికి మొదట్నుంచీ పవన్ కల్యాణ్ సంపూర్ణ మద్దతు తెలుపుతూ తన ట్వీట్లతో యువతను ఉత్తేజం చేశారు. కానీ, చివరికి వచ్చేసరికి ఆయన విశాఖ రాలేదు. ఆ తరువాత, ప్రెస్ మీట్ పెట్టి మార్చి నెలలో విశాఖలో శాంతి దీక్ష చేస్తానని పిలుపునిచ్చారు. సో… పవన్ తన పోరాటానికి అక్కడే పాజ్ బటన్ నొక్కి, అలా ఉంచారు.
వచ్చే నెల నుంచైనా ప్రత్యేక హోదాపై జనసేన పోరాటం తీవ్రం అవుతుందా..? ఈలోగా పవన్ మనసు మారే అవకాశం ఉందా అనే అనుమానాలు సహజంగానే చాలా మందికి కలుగుతాయి. మార్చి నెలలోపు ఆయన మారుతారో లేదో తెలీదుగానీ… వాస్తవాలను అర్థం చేసుకునేందుకు పవన్ అధ్యయనం మొదలుపెట్టినట్టు సమాచారం! వాస్తవాలు అంటే… ప్రత్యేక హోదాకు సంబంధించినవి! ప్రత్యేక హోదా రాకపోవడం వల్ల నష్టపోయామనే భావన ఆంధ్రుల్లో బలంగా ఉందా..? ఉంటే, ఏ స్థాయి బలంతో ఉంది అనే విషయాన్ని క్షుణ్ణంగా తెలుసుకునేందుకు పవన్ ప్రయత్నిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు.
హోదాతోపాటు ప్యాకేజీపై ప్రజల స్పందన ఎలా ఉందో కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారట! హోదాకు ప్రత్యామ్నాయంగా ఇది సరిపోయిందని ఆంధ్రులు భావిస్తున్నారా.. అనే అంశంపై కూడా ప్రజాభిప్రాయం తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నట్టు సమాచారం.
సో.. ఇకపై పవన్ కల్యాణ్ చేయబోయే పోరాటం ఎలా ఉంటుందన్నది తెలియాలంటే, కాస్త టైమ్ పడుతుంది. ఒకవేళ హోదా అంశాన్ని ఆంధ్రులు పెద్దగా ఎమోషనల్ గా తీసుకోవడం లేదనుకుంటే… పవన్ దృష్టి ప్యాకేజీపైకి వెళ్తుందనే భావించాలి. ప్యాకేజీలో ఉన్న లోపాలు, ఇంకా కావాల్సిన నిధులూ కేటాయింపులు, చట్టబద్ధతపై దృష్టి పెట్టే అవకాశం ఉంటుందని చెప్పుకోవచ్చు. మరి, పవన్ తెప్పించుకోబోతున్న ఆ అధ్యయనాల రిపోర్టులు ఎలా ఉంటాయో వేచిచూడాలి!