పశ్చిమ గోదావరి జిల్లా తుందుర్రులో మెగా ఆక్వాపార్కును తరలించే ప్రసక్తి వుండదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తేల్చి చెప్పడం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తొలి వినతికి తిరస్కరణే. అక్కడి డ్రైయిన్లను తద్వారా పొలాలను కలుషితం చేసే ఈ ప్రాజెక్టు వద్దన ఉద్యమం స్థానికుల నుంచే మొదలైంది. సిపిఎం కార్యదర్శి పి.మధు ప్రవేశంతో దానికి మరింత ఉధృతి వచ్చింది.ఆ సమయంలో ప్రభుత్వం మొండిగా తన వైఖరి కొనసాగించడమే గాక అరెస్టులు లాఠీచార్జిలతో ఉద్రిక్తత పెంచింది. ప్రతిపక్ష నేత జగన్ కూడా పర్యటించి వచ్చారు. బాధిత రైతులు పవన్ కళ్యాణ్‌ను కూడా కలిసి తమ బాధలు వినిపించి వచ్చారు. అవన్నీ విన్న తర్వాత తను ప్రభుత్వం దృష్టికి తెస్తానని ఆయన హామీనిచ్చారు. అయితే తర్వాత ప్రభుత్వ ప్రతినిధులు కాలుష్య నివారణ చర్యలు తీసుకుంటామని సర్దిచెప్పారు. కాని క్షేత్ర స్థాయిలో ఉద్యమం నిరసన మాత్రం ఆగలేదు. ఇలా చాలా దశలు గడిచిన తర్వాత ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు ఏది ఏమైనా ఫ్యాక్టరీని అక్కడి నుంచి తరలించే ప్రసక్తి లేదని ప్రకటించడంతో కథ మొదటికి వచ్చింది. వచ్చే పరిశ్రమలను వెనక్కు పంపితే తప్పు సంకేతాలు వెళతాయన్న చంద్రబాబు వాదన నిజమైతే దేన్నీ ప్రశ్నించకూడదన్నమాట. ఒకవేళ ఫ్యాక్టరీ పెట్టిన తర్వాత ఫలితాలు నష్టదాయకంగా వుంటే అప్పుడు కూడా ఇలాగే చెబుతారా? అంటే పర్యావరణ పరిరక్షణ ప్రజల ఆరోగ్యం వంటివాటిపై ఆందోళనలకు విలువే వుందదా? ఇలాటి చాలా ప్రశ్నలు ముందుకొస్తాయిప్పుడు. కాకపోతే ప్రశ్నించేందుకు పార్టీ పెట్టానన్న పవన్ కళ్యాణ్ ఈ తాజా పరిణామాన్ని గమనించి మరోసారి ప్రశ్నిస్తారేమో చూడాలి.