పవన్ కల్యాణ్‌కి మంచి దోస్త్ అలీ. పవన్ సినిమా అంటే… అలీ పక్కన ఉండడం కామన్ అయిపోయింది. ‘అలీ అంటే నాకెంతో ఇష్టం.. తను లేకుండా నేను సినిమా చేయలేను’ అని పవన్ కూడా ఓ సందర్భంలో చెప్పాడు. ‘మా స్నేహం చాలా గొప్పది..’ అంటూ పవన్ గురించి చాలాసార్లు కితాబులు ఇచ్చాడు అలీ. తను త్వరలోనే జనసేన పార్టీలో చేరతాడని, లేదంటే… కనీసం పవన్‌కి మద్దతు ఇస్తూ ప్రచారం చేస్తాడని వార్తలు కూడా వచ్చాయి. వీటిపై అలీ కూడా ఎప్పుడు సీరియస్ గా స్పందించలేదు. అలీ కూడా మా వాడే… అని పవన్ అభిమానులు గట్టిగా అనుకుంటారు.
అలాంటిది అలీకి పవన్ అభిమానుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అలీ.. జగన్ మోహన్ రెడ్డిని కలుసుకున్నప్పటి ఓ ఫొటో ప్రస్తుతం సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది. అసలు వీరిద్దరూ ఎప్పుడు కలుసుకున్నారు, సందర్భం ఏమిటి? అనేది తెలియకపోయినా.. ఈ ఫొటో సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ అవుతోంది. అలీ త్వరలోనే వైకాపా తీర్థం పుచ్చుకోబోతున్నట్టు ఊహాగానాలు కూడా మొదలైపోయాయి. ఇది ఎంత వరకూ నిజమో తెలీదు గానీ… ఈ టోటల్ ఎపిసోడ్‌ని కొంతమంది పవన్ కల్యాణ్ అభిమానులు సీరియస్‌గా తీసుకున్నారు. ‘పవన్ పక్కనే ఉంటూ.. ఇంత పనిచేస్తావా’ అన్నట్టు అలీని ఆడిపోసుకుంటున్నారు. ఈ ఫొటో, పవన్ అభిమానుల కామెంట్లు, దానికి ప్రతికా వైకాపా అభిమానులు పోస్టింగులతో… ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఫొటో చక్కర్లు కొడుతోంది. అలీ మనసులో ఏముందో తెలీదు గానీ.. ఒకే ఒక్క ఫొటో అలీని పవన్ ఫ్యాన్స్ ముందు విలన్ గా నిలబెడుతోంది. మరి దీనికి అలీ కామెంట్ ఏమిటో చూడాలి.