జనసేన అధినేత పవన్ కల్యాణ్.. తన సహజసిద్ధమైన రాజకీయ మార్గాన్ని మార్చుకుని అభిమానులను కూడా గందరగోళానికి గురి చేస్తున్నారు. వారు ఏ మార్గంలో పయనించాలో నిర్ణయించుకోలేనంత పరిస్థితికి నెట్టేస్తున్నారు. ఆ ప్రభావం… ప్రస్తుతం గట్టిగానే కనిపిస్తోంది. ధర్మపరిరక్షణ దీక్ష పేరుతో పవన్ కల్యాణ్.. దీపాలు వెలిగించాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. స్వయంగా తనకు తాను ఓ దీపాన్ని.. కార్తీక దీపం తరహాలో… వెలిగించారు. ఖుషీ సినిమాలో దీపం సీన్ సూపర్ హిట్ అయినట్లుగా…తన కొత్త రాజకీయ దారిలో ఈ దీపం ఎపిసోడ్ కూడా సూపర్ హిట్టవుతుందని అనుకున్నారేమో కానీ.. మంచి కవరేజ్ వచ్చేలా చూసుకున్నారు. కానీ.. ఈ దీపం కాన్సెప్ట్ ఎమిటో జనసైనికులకు అర్థం కాలేదు. అందుకే ఎవరూ పట్టించుకోలేదు. పైగా… ఇదేందన్నా.. అని ప్రశ్నలే సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపించాయి.
హిందూత్వ రాజకీయాల్ని చేస్తున్న పవన్ కల్యాణ్.. అంతర్వేది రథం ఘటనపై దూకుడుగా ఉన్నారు. ఏపీలో హిందూత్వంపై దాడి జరిగిపోతోందని.. రక్షించాల్సిందేనని ధర్మపరిరక్షణ దీక్ష చేశారు. బీజేపీతో కలిసి చేసినా.. బీజేపీకి ఎలాగూ క్యాడర్ లేదు.. లీడర్లు కూడా అయితే ఢిల్లీ లేకపోతే.. అడ్రస్ తెలియని గల్లీల్లోనే ఉంటారు కాబట్టి… వారు కూడా.. జనసేన మీద ఆధారపడాల్సిందే. అయితే పవన్ పై గౌరవమో.. మరో కారణమో కానీ.. రెండురోజుల కిందట.. ధర్మపరిరక్షణ దీక్షను.. జనసైనికులు కొన్ని చోట్ల పాటించారు. కానీ.. అదయిపోగానే.. మళ్లీ దీపం వెలిగించాలని పిలుపునిచ్చారు. ఈ దీపం వెలిగించడం ఏమిటో అర్థం కాని జనసైనికులు.. మన కోసం కాదులే అని లైట్ తీసుకున్నారు. దాంతో పవన్ .. ఆయనకు మద్దతుగా కుటుంబసభ్యులు తప్ప.. ఏ ఒక్కరూ లైట్ వెలిగించలేదు.
పవన్ కల్యాణ్ భావజాలం ఇప్పటి వరకూ వేరు. ఆయన భావజాలానికి ఫ్యాన్స్ అయ్యారు. ఇప్పుడు ఆయన ఒక్క సారిగా రూటు మార్చేసుకుని.. దీపాలు.. ధర్మపరిరక్షణ దీక్షలు అంటే.. ఫ్యాన్స్ కన్ఫ్యూజ్ కాకుండా ఉంటారా..? ఇప్పుడు అంతే కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఆ విషయం సోషల్ మీడియాలో స్పష్టంగానే కనిపిస్తూనే ఉంది. పవన్ కల్యాణ్ ఇప్పటి వరకూ ఎలాంటి స్టేట్మెంట్లు ఇచ్చినా… తమ నాయకుడు ఆలోచించే చేస్తాడని సమర్థించుకునే సైనికులు ఇప్పుడు మాత్రం.. ఈ మతం గోలేమిటన్న అని చిరాకు పడుతున్నారు. ప్రజా సమస్యలపై పోరాటాలకు పిలుపునిస్తే.. రోడ్లపైకి వస్తాం కానీ దీపాలు పెట్టమనడం ఏమిటని ఆశ్చర్యపోతున్నారు.
భారతీయ జనతా పార్టీ నేతలు.. తమ స్టైల్ రాజకీయాలకు జనసేనను బాగానే ఉపయోగించుకుంటున్నారు. ఆ విషయం జనసైనికులకు ఇప్పుడిప్పుడే అర్థం అవుతోంది లైట్ తీసుకున్న లైటింగ్ ఎపిసోడ్‌తోనే తేలిపోతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికైనా జనసేనాని తన బేస్ ఏంటో గుర్తించకపోతే.. పూర్తిగా ఫ్యాన్ బేస్‌లో గందరగోళం ఏర్పడే ప్రమాదం ఉంది. అదే జరిగితే.. తనకు .. తన పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశం ఉంది.