ధాన్యం రైతులకు చెల్లించాల్సిన నిధులను ఏం చేశారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్లో ధాన్యం రైతులకు ఏపీ సర్కార్ రూ. రెండు వేల కోట్లకుపైగా బాకీ ఉందన్న విషయం వెలుగులోకి వచ్చింది. ధాన్యం సేకరించిన ప్రభుత్వం వారికి చెల్లింపులు చేయలేదు. గతంలో ఇదే అంశంపై రైత సౌభాగ్య దీక్ష చేసిన పవన్ కల్యాణ్… అప్పట్లో.. ప్రభుత్వం.. ధాన్యం రైతులకు 48 గంటల్లో చెల్లించాల్సిన సొమ్మును చెల్లించేందుకు నిధులు కేటాయించామని ప్రకటిందని.. ఆ నిధులన్నీ ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. హామీ ఇచ్చిన ప్రభుత్వమే రైతులను నిలువునా మోసం చేసిందని మండిపడ్డారు.
ధాన్యం అమ్ముకొని వారాలు గడుస్తున్నా…ఇప్పటికీ సొమ్ములు రాక రైతులు ఇబ్బంది పడుతున్నారని .. రైతు సంక్షేమం, భరోసా అంటూ ఎన్నికల సమయంలో వాగ్దానాలు చేసి.. చివరికి ధాన్యం అమ్మిన సొమ్ము కూడా ప్రభుత్వం ఇవ్వడం లేదని మండిపడ్డారు. లక్ష మందికిపైగా రైతులకు మొత్తం రైతులకు రూ.2,016 కోట్ల మేర చెల్లించాల్సి ఉందని సొమ్ములు ఎప్పుడు చెల్లిస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. వారం, పది రోజుల్లో ప్రభుత్వం రైతులకు ధాన్యం బకాయిలు చెల్లించకపోతే… తదుపరి కార్యాచరణ ప్రారంభించాలనే ఆలోచన జనసేన నేతల్లో ఉన్నట్లుగా తెలుస్తోంది.
అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రభుత్వం రైతుల గురించి పెద్ద పెద్ద మాటలు చెబుతోంది కానీ… కార్యాచరణలో మాత్రం.. అసలు నిధులు కేటాయించడం లేదని జనసేన భావిస్తోంది. అందుకే గతంలో తాము రైతు సౌభాగ్య దీక్ష చేశామని… సమస్యను పరిష్కరించకపోతే.. మరోసారి అలాంటి కార్యాచరణ ప్రకటించాలని అనుకుంటోంది.