దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై ఫైర్ అయ్యారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. బుధవారం నుంచి పవన్ ప్రజాపోరాట యాత్ర పునః ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఏలూరులో మకాం వేసిన పవన్ కల్యాణ్… ఓ ప్రెస్ మీట్ లో విమర్శలు చేశారు. చింతమనేని రౌడీలా వ్యవహరిస్తున్నారనీ, ఆయనపై ముఖ్యమంత్రి దృష్టి సారించాలని పవన్ కోరారు. దళిత తేజం అంటూ వారికి అండగా ఉంటామని మాట్లాడుతుంటారనీ, కానీ ఇక్కడ టీడీపీ ఎమ్మెల్యే ప్రజలను తిట్టీ కొట్టీ హింసించే పరిస్థితి ఉందన్నారు. కులాల పేరుతో విమర్శలు, ఇతర పార్టీల నేతలపై రాళ్లేయించడం చేస్తుంటారనీ, ప్రజలను బెదిరిస్తున్నారనీ, మీరు ప్రజాస్వామ్యాన్ని మరిచిపోతున్నారా, లేదంటే రాజులు అనుకుంటున్నారా అని మండిపడ్డారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమ శాసనసభ్యులను క్రమశిక్షణలో పెట్టుకోవాలనీ, లేకపోతే ఆ బాధ్యతను ప్రజలు తీసుకునే రోజులు వస్తాయని పవన్ వ్యాఖ్యానించారు. మీ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకుంటారా, లేదంటే ప్రజలు తిరగబడితే చూస్తారా అంటూ ముఖ్యమంత్రిని పవన్ కల్యాణ్ సూటిగా ప్రశ్నించారు. ఇప్పటికైనా చింతమనేనిపై రౌడీ షీట్ తెరవాలనీ, లేదంటే ప్రజాక్షేత్రంలో జరిగే కార్యక్రమాలను ఆపగలరా అంటూ హెచ్చరించారు కూడా!
ఈ వ్యాఖ్యల నేపథ్యంలో పవన్ యాత్ర ప్రారంభానికి ముందే కొంత వేడి పెంచిందనే చెప్పొచ్చు. ఎందుకంటే, దెందులూరులోనే పవన్ పర్యటన ఉంటుంది. తాజా వ్యాఖ్యల నేపథ్యంలో టీడీపీ వర్గాల నుంచి ఎలాంటి స్పందన వస్తుందనే ఉత్కంఠ నెలకొంది. దీంతో పోలీసులు కూడా ముందస్తుగా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నట్టు సమాచారం. నిజానికి, చింతమనేని దుందుడుకు స్వభావంపై కొన్ని విమర్శలున్నమాట వాస్తవమే. అయితే, పవన్ అక్కడితో ఆగకుండా… ప్రజలు తిరగబడితే ఎలా ఉంటుందో చూస్తారా అంటూ హెచ్చరించడం ఒకింత రెచ్చగొట్టే విధంగానే కనిపిస్తోంది. కానీ, చింతమనేని వర్గం నుంచి ఈ వ్యాఖ్యలపై అనూహ్యమైన స్పందన వెంటనే ఉంటుందని చెప్పలేం! ఎందుకంటే, దాని వల్ల అనవసర వాగ్వాదమే తప్ప, ఏరకంగానూ ప్రయోజనం కనిపించడం ఉండదని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. మరి, పవన్ తాజా వ్యాఖ్యలపై చింతమనేని ఎలా స్పందిస్తారో చూడాలి.