జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఢిల్లీ నుంచి నేరుగా కాకినాడకు వచ్చి.. ద్వారంపూడి అనుచరుల చేతిలో గాయపడిన కార్యకర్తలను.. వీర మహిళలను పరామర్శించారు. రాష్ట్రంలో పాలెగాళ్ల రాజ్యం.. ఫ్యాక్షన్ సంస్కృతి నడుస్తోందని మండిపడ్డారు. అధికారం ఎల్లవేళలా ఉండదని.. గుర్తుంచుకోవాలన్నారు. పవన్ కల్యాణ్.. కాకినాడ వస్తున్న సందర్భంగా పెద్ద ఎత్తున అభిమానులు .. వచ్చారు. ద్వారంపూడిని టార్గెట్ చేసి.. పవన్ కల్యాణ్ ఢిల్లీలో మాట్లాడటం.. కాకినాడలోనే తేల్చుకుంటామని ప్రకటించడంతో.. పోలీసులు ముందస్తు చర్యగా.. 144 సెక్షన్, 30 యాక్ట్ అమలు చేస్తున్నట్లుగా ప్రకటించారు. ద్వారంపూడి ఇంటి వద్ద రెండు, మూడు వందల మంది పోలీసుల్ని మోహరించారు. నేరుగా ఢిల్లీ నుంచి.. విశాఖలో దిగిన పవన్.. రోడ్డు మార్గం ద్వారా కాకినాడకు వచ్చారు. గాయపడిన కార్యకర్తలను పరామర్శించి మీడియాతో మాట్లాడారు.
వైసీపీలో కొంత మంది మదమెక్కిన నేతలు .. అసభ్యంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అసభ్యంగా మాట్లాడి.. గొడవలు జరగడానికి కారణమైన ద్వారంపూడిపై కేసు నమోదు చేయాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. తాము శాంతిభద్రతల సమస్య సృష్టిస్తే మీరెవరూ ఉండలేరని హెచ్చరించారు. మరోసారి దాడుల ఘటనలు జరిగితే.. చేతులు కట్టుకుని కూర్చోబోమన్నారు. దాడులు చేసిన వైసీపీ నేతలు, కార్యకర్తలపై పోలీసులు కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఇద్దరు పోలీసు అధికారులు అత్యుత్సాహంతో వ్యవహరించారని.. వారిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు. పోలీసు శాఖ తీరు బాధ కలిగిస్తోందన్నారు. తాను అన్నింటికి తెగించి వచ్చానని.. కేసులు పెడితే భయపడబోమన్నారు. పండుగ వాతావరణం కలుషితమవడానికి వైసీపీ నేతల భాషే కారణమని.. వారు ఇలా మాట్లాడటం ఇదే చివరి సారి కావాలన్నారు.
ఈ నెల పదహారో తేదీన బీజేపీతో పొత్తుపై.. సంయుక్తంగా అధికారిక ప్రకటన చేయబోతున్నట్లుగా పవన్ కాకినాడలో తెలిపారు. ఢిల్లీ పర్యటన వివరాలను.. కాకినాడలోనే మీడియాకు తెలిపారు. రాజధాని, రైతుల సమస్యలు, పెట్టుబడులు పోవడం.. లాంటి అంశాలన్నింటినీ కేంద్రానికి వివరించానన్నారు. ఏ ఆశయాలతో ప్రధాని మోదీ ముందుకెళ్తున్నారో ఏపీలో మాత్రం ఆ పరిస్థితి లేదని వివరించానని పవన్ తెలిపారు. మొత్తానికి పవన్ కాకినాడ పర్యటన.. ముందు అనుకున్నంత వేడిగా సాగలేదు.