ప్రత్యేక హోదా కోసం, ఆంధ్రా ప్రయోజనాల సాధన కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అఖిల పక్షాన్ని పిలవాలన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్! అన్ని పార్టీలనూ పిలిచి చర్చించాలనీ, అందరం కలిసి ఢిల్లీకి వెళ్దామని చంద్రబాబు నాయుడుని కోరారు! అదేంటీ… గతంలో ఇదే అంశమై పవన్ కల్యాణ్ ను కూడా అఖిల పక్షం భేటీకి ముఖ్యమంత్రి పిలిచారు కదా, కానీ ఆయన హాజరు కాలేదు కదా అనే అంశం ఎవరికైనా వెంటనే గుర్తొస్తుంది..! గతంలో అఖిల పక్షానికి గైర్హాజరైన పవన్.. ఇప్పుడు ఎందుకు మళ్లీ అడుగుతున్నారు..? అప్పటికీ ఇప్పటికీ మార్పు ఏదైనా ఉందా అంటే… ఆ విషయం కూడా పవనే చెప్పారు.
గతంలో ముఖ్యమంత్రి పెట్టిన అఖిల పక్ష సమావేశం మనస్ఫూర్తిగా ఏర్పాటు చేసింది కాదన్నారు పవన్. ఆ సమయంలో ముఖ్యమంత్రిలో తనకు చిత్తశుద్ధి కనిపించలేదన్నారు. నిజంగానే ఆయనకి చిత్తశుద్ధి ఉంటే.. దాని పద్ధతి వేరేలా ఉంటుందన్నారు. తనను అవసరాలకి మాత్రమే వినియోగించుకున్నారనీ, రాష్ట్ర ప్రయోజనాల కోసం ఉన్న ఒక పార్టీ అధినేతగా తనని ముఖ్యమంత్రి గుర్తించలేదన్నారు. అందుకే తన నుంచి స్పందన రాలేదన్నారు! ఎప్పటికప్పుడు మాటలు మారుస్తున్నారు కాబట్టి, అఖిల పక్షం కూర్చోబెట్టి మాట్లాడతారంటే ఏం త్రికరణ శుద్ధి ఉంటుందన్నారు! అందుకే, అప్పుడు వెళ్లలేదన్నారు, ఇప్పుడు మనస్ఫూర్తిగా అడుగుతున్నామన్నారు.
అంటే, అఖిలపక్షం పిలిచిన సమయంలో చంద్రబాబులో చిత్తశుద్ధి, త్రికరణ శుద్ధి లాంటివేవో లేవని అనిపించాయి కాబట్టి.. వెళ్లలేదన్నారు, బాగుంది! మరి, ఇప్పుడు అఖిల పక్షం పెడితే వెళ్తామని పవన్ అంటున్నారు… మరి, ముఖ్యమంత్రి తీరులో రాష్ట్ర ప్రయోజనాల పట్ల ఇప్పుడా త్రికరణ శుద్ధి, చిత్తశుద్ధి ఉన్నట్టుగా పవన్ కనిపిస్తోందా..? చంద్రబాబు నాయుడు మీద అభిప్రాయం తనకు మారింది కాబట్టే, ఇప్పుడు కొత్తగా అఖిల పక్షంతో ఢిల్లీకి వెళ్దామని అంటున్నారా..?
ఇంకోటి.. పవన్ ఇప్పుడు కోరుతున్నట్టుగా అఖిల పక్షాన్ని వెంటేసుకుని ఢిల్లీకి సీఎం చంద్రబాబు నాయుడు వెళ్లే పరిస్థితి ఉందా..? ఏపీ సీఎం అపాయింట్మెంట్ కోరితే… అది కూడా ప్రత్యేక హోదాపై మాట్లాడేందుకు ఆంధ్రా పార్టీలను చంద్రబాబు తీసుకొస్తే… మోడీ కలిసేందుకు సమయం ఇస్తారని ఎవరైనా ఊహించగలరా..? ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో అఖిల పక్షాన్ని ఢిల్లీ వరకూ తీసుకెళ్లే వీలు ఉందని ఎవ్వరూ అనుకోవడం లేదు కదా! కానీ, పవన్ మాత్రం ఇప్పుడు పిలవాలనే అంటున్నారు.