జనసేన అధినేత పవన కల్యాణ్ పశ్చిమగోదావరి జిల్లా పోరాటయాత్ర హుషారుగా సాగుతోంది. ఉత్సాహంగా తరలి వస్తున్న యువతకు పవన్ కల్యాణ్.. జనసేన ఆశయాలను వివరిస్తున్నారు. అయితే పోరాటయాత్ర ప్రసంగాల్లో చంద్రబాబునాయుడు తనయుడు లోకేష్ ప్రస్తావన ఎక్కువగా వస్తోంది. ఆయనపై విమర్శలు చేయడానికి పవన్ కల్యాణ్ ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. నిడదవోలులో జరిగిన బహిరంగ సభలో లోకేష్‌పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. లోకేష్ తన తండ్రిని కాకుండా.. మహ్మాత్ముల్ని ఆదర్శంగా తీసుకోవాలని పవన్ సూచించారు. స్టాన్‌ఫర్డ్‌లో చదువుకున్న లోకేష్.. యూనివర్సిటీలో చదువుతున్న కెనడీ చెప్పిన మాటలు ” దేశం నాకేమి ఇచ్చిందని కాదు.. దేశానికి నేను ఏమి ఇచ్చాను” ఆచరించాలని సూచించారు. కానీ లోకేష్ మాత్రం దేశం నుంచి ఎంత దోచుకుందామా అని చూస్తున్నారన్నారు.
గతంలో శ్రీరెడ్డి అనే నటీమణి వివాదం విషయంలో.. లోకేష్ హస్తం ఉందని… పవన్ కల్యాణ్ ఆరోపించారు. అదే అంశాన్ని నిడదవోలులోనూ… ప్రస్తావించారు. లోకేష్… ఎదురుగా కౌగిలించుకొని వెనుక నుంచి పొడుస్తామంటే.. పడేవాళ్లు లేరని మండిపడ్డారు. లోకేష్ కూడా నన్ను తిట్టిస్తున్నారు. నా తల్లిని అనకూడని మాటలు అనిపించారని మండిపడ్డారు. లోకేష్ గారు.. ఒక్కసారి మీ అమ్మగారిని అడగండి. నేను ఇలా తిట్టించాను.. తప్పా.. ఒప్పా అని అడగండి ఆవేశంగా ప్రసంగించారు. జగన్ తనపై చేసిన వ్యక్తిగత విమర్శలపైనా పవన్ స్పందించారు. ప్రజాసమస్యలపై స్పందిస్తూంటే.. జగన్ తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతున్నారని… తన జీవితంలో రహస్యాలు లేవని పవన్ స్పష్టం చేశారు. తాడేపల్లి గూడెం సభలోనూ.. లోకేష్‌ను పవన్ కల్యాణ్ టార్గెట్ చేసుకున్నారు.
నిడదవోలులో జరిగిన బహిరంగ సభలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ ఆ పార్టీ గుర్తును ప్రకటించారు. “పిడికిలి” జనసేన పార్టీ గుర్తుగా ఆయన పేర్కొన్నారు. సమాజంలో అందరి ఐక్యతకు చిహ్నంగా పిడికిలి ఉంటుందని ఆయన అన్నారు. అన్ని కులాలు, అన్ని మతాలు కలిసికట్టుగా ఉండి బలాన్ని చాటేలా పిడికిలి చూపుదామని పిలుపునిచ్చారు. అయితే ఇది పార్టీ గుర్తుగా ఉంటుందేమో కానీ.. ఎన్నికల గుర్తుగా ఉండే అవకాశం లేదని ఎన్నికల నిపుణులు చెబుతున్నారు.