ఈ రోజు అమలాపురం ప్రచార సభలో జన సేన అధినేత పవన్ కళ్యాణ్ టిడిపి రామచంద్రపురం ఎమ్మెల్యే అభ్యర్థి తోట త్రిమూర్తులు పై తీవ్రంగా విరుచుకు పడ్డారు. తోట త్రిమూర్తులు ఇటీవల తన నియోజకవర్గంలో , జనసేన అభిమానులతో పవన్ కళ్యాణ్ అభిమానులతోనూ మాట్లాడుతూ, టిడిపి జన సేన రెండు ఒకటేనని, పవన్ కళ్యాణ్ ని అభిమానించే వారు కూడా టిడిపికి ఓటు వేయాలని, పవన్ కళ్యాణ్ తాము చెబితే వినే మనిషిని, వ్యాఖ్యలు చేశాడు. ఈ వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్ దాకా చేరడంతో, చిర్రెత్తుకొచ్చిన పవన్ కళ్యాణ్, తోట త్రిమూర్తులు పై ఈరోజు విరుచుకు పడ్డాడు.
నిజానికి రామచంద్రాపురం లోనే పవన్ కళ్యాణ్ పర్యటన జరగాల్సి ఉండగా, ఆ రోజున పవన్ కళ్యాణ్ అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చేరాల్సి రావడంతో ఆ పర్యటన రద్దు అయింది. అయితే ఈ రోజు అమలాపురం సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, టిడిపి మనుషులు చెబితేనో, తోట త్రిమూర్తులు చెబితేనో తాను వింటానని త్రిమూర్తులు చేస్తున్న వ్యాఖ్యల పై ఫైర్ అయ్యారు. రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు తన సొంత అన్నయ్యను కాదు అనుకుని వచ్చిన వాడిని అని, గుర్తు చేసిన పవన్ కళ్యాణ్, ఇప్పుడు తోట త్రిమూర్తులు చెబితేనో చంద్రబాబు చెబితేనో వింటానని ఎలా అనుకున్నారని తోట త్రిమూర్తులు ని ప్రశ్నించారు. తోట త్రిమూర్తులు లాంటివాళ్ళు, చంద్రబాబు మోచేతి కింద నీళ్లు తాగుతూ బానిస బతుకు లకు అలవాటు పడిపోయారని, మీ బానిస బతుకు లని కొత్త తరం మీద రుద్ద వద్దని పవన్ కళ్యాణ్ అన్నారు. ఒక మనిషిని 20 ఏళ్లపాటు సంకెళ్ళతో బంధించి వేసి తక్కువ తిండి పెడితే, ఒకసారి ఆ సంకెళ్ళు తీసి వేసినా కూడా వారికి అదే బానిసత్వం అలవాటయి, అలాగే చేతులు ముడుచుకుని తక్కువ తింటూ ఉంటారని, తోట త్రిమూర్తులు లాంటి నేతలు చంద్రబాబు వద్ద అలాంటి బానిసత్వానికి అలవాటైపోయి ఉన్నారని వ్యాఖ్యానించారు.
ఇదే తరహాలో జన సేన అభిమానుల ను టిడిపి కి ఓటు వేయమని చెప్పిన మెట్ల సత్య నారాయణ మీద కూడా పవన్ కళ్యాణ్ విమర్శలు చేశారు. రామచంద్రపురం లో తోట త్రిమూర్తులు మీద, జనసేన అభ్యర్థి పోలిశెట్టి చంద్రశేఖర్‌ను గెలిపించాలని, తోట త్రిమూర్తులు గెలిస్తే చంద్రబాబు గెలిచినట్టు, పోలిశెట్టి చంద్రశేఖర్ గెలిస్తే పవన్ గెలిచినట్టు అని వ్యాఖ్యానించారు. చంద్ర బాబు లాగా తాను కులాలను విడదీసే రాజకీయం చేయడం లేదని, కులాల ను కలిపే రాజకీయం చేస్తున్నానని, కాపులు శెట్టి బలిజ ల మధ్య ఉన్న విభేదాలు చూసి ఎంతో బాధపడి శెట్టిబలిజ నాయకులతో తానే స్వయంగా మాట్లాడానని, వారిని ఆలింగనం చేసుకొని పార్టీలోకి ఆహ్వానించానని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. అప్పట్లో ప్రజా రాజ్యం సమయంలో కూడా చిరంజీవి మీద ఇలాగే కాపు ముద్ర వేసి దొంగ దెబ్బ తీశారని అన్న పవన్ కళ్యాణ్ తనని కూడా అలా ఒక కులానికి పరిమితం చేసే ప్రయత్నాలు చేస్తే తాట తీస్తాం అని అన్నారు. మీ ఇంట్లో ఫంక్షన్ లకు, హాజరయ్యాను అంటే అది నా సంస్కారం అని, నా తల్లి నాకు నేర్పిన సంస్కారం అని, దాన్ని అడ్డు పెట్టుకొని జనసేన ను దెబ్బ తీయాలని చూస్తే సహించేది లేదని పవన్ కళ్యాణ్ అన్నారు.
పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు అమలాపురం సభలో భారీగా స్పందన వచ్చింది. ఇటీవల డాక్టర్లు కాస్త రెస్ట్ తీసుకోవాలని చెప్పినప్పటికీ వినకుండా హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయిన పవన్ కళ్యాణ్, సెలైన్ ఎక్కించడానికి చేతికి గుచ్చిన కాన్యులా తో అలాగే ప్రచారం చేస్తుండడం తో అభిమానులు మరింత ఎమోషనల్ అయిపోతున్నారు. ఏది ఏమైనా తోట త్రిమూర్తులు పై పవన్ కళ్యాణ్ చేసిన తీవ్ర వ్యాఖ్యలు ప్రజలపై గట్టిగానే ప్రభావం చూపే అవకాశం ఉంది.