కాటమ రాయుడు ఫంక్షన్లో జనసేన అద్యక్షుడు పవన్ కళ్యాణ్‌ను మీడియా పెద్దలు ఆకాశానికి ఎత్తడం గురించి 360లో స్టోరీ వచ్చింది. ఆ మరుసటిరోజునే ఈనాడు ఆదివారం అనుబంధంలో కవర్ స్టోరీ పవన్ కళ్యాణ్ అనుభవాలు అభిప్రాయాల మాలికగా వుండటం దీని కొనసాగింపు లాటిదే. ఈ జ్ఞాపకాలలో పవన్ కళ్యాణ్ తనను తాను ఆవిస్కరించుకోవడానికి ప్రయత్నించిన తీరు నాటకీయంగానే వుంది. చిన్నప్పటి కష్టాలు అన్నయ్యనే ఆరాధ్యభావంతో చూస్తూ ఆయన నీడన పెరగడం వంటివన్నీ బాగానే రాశారు. తను పరీక్షల్లో దెబ్బతినడం, వివిధ రకాల శిక్షణలు పొందినా జయప్రదం కాలేకపోవడం గురించి తెలిపారు. ఇవన్నీ అయ్యాకనే చిరంజీవి అన్నిచోట్లా డెబ్బతింటున్నావు గదా సినిమాల్లోనైనా ప్రయత్నించు అన్నారట. అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేయాలనుకుంటే వద్దని సత్యానంద్ దగ్గర శిక్షణలో పెట్టారు. ఆయన ఎలాగో బిడియం పోగొట్టాడు. మొదటి సినిమా తనకు ఇష్టం లేదు. అంతా కృత్రిమంగా అనిపించింది. అదే ఆఖరి సినిమా కావాలనుకున్నారట. తర్వాత అలా నిలదొక్కుకున్నారట. తను చేయగలిగిందే చేస్తానని చెప్పిన పవన్ సినిమా వేడుకలో మాత్రం తన చిత్రాలు తన భావాల ప్రతిబింబాలేనన్నారు. అదే నిజమైతే ఆయన చిత్రాలు చాలా భాగం గజిబిజిగా లేదా లైట్‌గా వున్నట్టే పవన్ కూడా వుంటారా? చాలా వరకూ అల్లరి చిల్లరి వేషాలతో మసాలాలతో నిండిన ఈ చిత్రాల్లో పెద్ద భావాలేముంటాయి? ఏమున్నాయి?
రాజకీయ భాగంలోకి వచ్చేసరికి పవన్ ఒక్కసారి గంభీరంగా మారి రేపటి తరం కోసమే తన ఆవేదన అని ప్రకటించారు. మరోవైపున వచ్చే ఎన్నికల్లో ఏదో పెద్దగా సాధించాలనే ఆశలు లేవని కూడా చెప్పారు. ఆయన తమ తరపునే పనిచేస్తున్నారని టిడిపి బిజెపి కూడా చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో చూస్తే పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రకటనలు గతంలో వున్న పదును ప్రభావం కోల్పోతున్నాయనే చెప్పాలి. ఒక విధమైన అండర్ స్టేట్మెంట్తో లేదంటే బహిరంగంగా తన అస్పష్టతను చెప్పేయడం ద్వారాకాలం గడుపుకోవచ్చని ఆయన అనుకుంటే పోరబాటే. ఇప్పటికే టిడిపి బిజెపిలపై విమర్శల పదును తగ్గించిన పవన్ కళ్యాణ్ విశ్వసనీయత నిలబెట్టుకోవడం ఒక సవాలే. చివరకు పార్టీని ఎలా నిర్మించుకుంటారు ఎవరితో కలుస్తారు అనేది లేక ఎవరికి ఉపయోగపడబోతున్నారనేది కాలమే చెప్పాలి. కాని మూెడు ప్రధాన ఛానల్ల మద్దతు మాత్రం ఆయనకు ఇప్పటికే లభించింది.ఈ రోజు తనేమి ఆలోచిస్తున్నది చెప్పకుండా రేపటి తరానికి ఏదైనా చేస్తాననడం మరీ అతిశయోక్తిగా వుంది.