జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రశ్నిస్తారు. కానీ, సమాధానాల కోసం ఆయన పోరాటం చెయ్యరు! దాదాపు ఇలాంటి ఒక అభిప్రాయమే ప్రజల్లో నెమ్మదిగా స్థిరపడేలా ఉంది. తాజాగా అగ్రిగోల్డ్ బాధితుల గురించి పవన్ స్పందించారు. వారి సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ సమస్య చాలా సున్నితమైందనీ, దీనికి డెడ్ లైన్లు పెట్టుకుని తొందరపాటుగా వ్యవహరించొద్దని పవన్ సూచించారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వానికి చెందిన కొంతమంది పేర్లు కూడా వినిపిస్తున్నాయని అభిప్రాయపడ్డారు. అగ్రిగోల్డ్ లో ఎంతోమంది సామాన్య ప్రజలు సొమ్ము దాచుకున్నారనీ, ఇలాంటి సమయంలో ప్రభుత్వమే వారికి పరిహారం చెల్లించాలనీ, ఇతర రాష్ట్రాల్లో కూడా ఇలానే జరిగిందని పవన్ అన్నారు. ఈ సమస్యపై ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించాలనీ, బాధితులకు న్యాయం జరగాలని అన్నారు.
పవన్ కల్యాణ్ తీరు ఏమాత్రం మారలేదు అనడానికి ఇదే ఉదాహరణ! ఇప్పటికే ఆయన చాలా విమర్శలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆడించినట్టే ఆయన ఆడుతూ ఉంటాయన్న విమర్శ ఎప్పట్నుంచో ఉన్నదే. చంద్రబాబు ఏదైనా ఒక సమస్యలో ఉంటే.. దాన్నుంచి ప్రజలను డైవర్ట్ చేసేందుకు పవన్ తెరమీదికి వస్తుంటారనే ఆరోపణ ఉంది. ఇప్పుడు పవన్ కల్యాణ్ స్పందించిన తీరు కూడా ఆ స్క్రిప్ట్ లో భాగమేనా అనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం ఆంధ్రాలో హాట్ టాపిక్ గా మారుతోంది తుందుర్రు మెగా ఆక్వా ఫుడ్ పార్క్ వివాదం. ఈ పార్క్ వల్ల గోదావరి కలుషితం అవుతుందనీ, గొంతేరు కాలువపై ఆధారపడి బతికే వారికి జీవన్మరణ సమస్యగా మారుతుందంటూ ఓ ఉద్యమం సాగుతోంది. చంద్రబాబు అనుకూల మీడియా ఈ ఇష్యూని వెలుగులోకి రానివ్వడం లేదు. తుందుర్రు ప్రాంతంలో 144 సెక్షన్లు, అరెస్టులు కొనసాగుతున్నాయి. విశ్వమానవ వేదిక అనే స్వచ్ఛంద సేవా సంస్థపై స్థానికంగా విపరీతమైన ఒత్తిళ్లు పెరుగుతున్నాయి. రకరకాల కేసుల పేరు చెప్పి యువతను అరెస్టు చేస్తున్నారు.
నిజానికి, పవన్ స్పందించాల్సిన ఇష్యూ ఇది. ఎందుకంటే, తుందుర్రు ఆక్వా రైతుల సమస్యపై గతంలో పవన్ మాట్లాడారు. హైదరాబాద్ లోప్రెస్ మీట్ పెట్టి, మీకు అండగా ఉంటా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా అంటూ ప్రకటించారు. ఆ తరువాతి నుంచే తుందుర్రులో అరెస్టులు పెరిగాయి. అయినాసరే, పవన్ అటువైపు తిరిగి చూసే ప్రయత్నం చేయడం లేదు.
సో.. ఇప్పుడీ అణచివేత నెమ్మదిగా సోషల్ మీడియా ద్వారా అందరికీ తెలుస్తోంది. ఈ తరుణంలో పవన్ కల్యాణ్ ఆ విషయాన్ని వదిలేసి… అగ్రిగోల్డ్ బాధితులు అంటూ మాట్లాడుతున్నారు. నిజానికి, అగ్రిగోల్డ్ బాధితుల సమస్య కూడా పెద్దదే. వారి ఆవేదన కూడా ప్రభుత్వం ఆలకించాల్సిందే. అయితే, ప్రజల ఫోకస్ ను ఒక సమస్య నుంచి వేరేదానిపై డైవర్ట్ చేయడంలో చంద్రబాబు సిద్ధహస్తుడనే విమర్శలున్నాయి. పశ్చిమ గోదావరిలో సాగుతున్న ఆక్వా ఫుడ్ పార్క్ వ్యతిరేక ఉద్యమ తీవ్రత పెరుగుతున్న ఈ తరుణంలో.. అగ్రి గోల్డ్ బాధితుల గురించి పవన్ స్పందించడం ఏంటనేదే ప్రశ్న వినిపిస్తోంది! ఇది కూడా చంద్రబాబు వ్యూహమేనా… దాని ప్రకారమే పవన్ తెరమీదికి వచ్చారా అనే అనుమానం కొంతమందిలో కలుగుతోంది.
చంద్రబాబు చేతిలో కీలుబొమ్మ అనే అభిప్రాయాన్ని పవన్ చెరుపుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ తరుణంలో తుందుర్రు గురించి పవన్ మాట్లాడితే… అలాంటి విమర్శలన్నీ పటాపంచలైపోతాయి. కానీ, పవన్ తీరు చూస్తుంటే, అలాంటి పని చేసేలా కనిపించడం లేదనే అనిపిస్తోంది.