ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై పవన్ కల్యాణ్ సమరభేరీ మోగించాలని నిర్ణయించారు. ప్రభుత్వం మారిన తర్వాత పూర్తి స్థాయిలో కుదేలై.. ఆర్థికంగా తీవ్ర ఇక్కట్లు పడుతున్న భవన నిర్మాణ కార్మికులకు అండగా ఉండేలా.. జనసేనాని మొదటి కార్యాచరణ సిద్ధం చేసుకున్నారు. వచ్చే నెల మూడో తేదీన విశాఖపట్నంలో.. భారీ ర్యాలీ నిర్వహించబోతున్నారు. గత ఐదు నెలల కాలంలో.. ఏపీలో .. భవన నిర్మాణ కార్మికులు ఎదుర్కొన్న పరిస్థితులు.. వారిని ఆర్థికంగా కోలుకోలేని విధంగా దెబ్బ తీసిన ప్రభుత్వ వ్యవహారాలు.. ఇసుక విధానం.. వంటి అంశాలపై సర్కార్‌ను జనసేనాని ర్యాలీలో నిలదీయబోతున్నారు మూడో తేదీన మధ్యాహ్నం మూడు గంటలకు విశాఖలో ర్యాలీ ప్రారంభమవుతుంది. జనసేనాని అగ్రభాగంలో ఉండి.. అందర్నీ నడిపిస్తారు. విశాఖలో ర్యాలీని ఎక్కడి నుంచి ఎక్కడి వరకూ నిర్వహించాలనేదాన్ని… ఆ జిల్లా నేతలతో కలిసి పవన్ కల్యాణ్ నిర్ణయిస్తారు.
వంద రోజుల పాటు ప్రభుత్వ పనితీరును పరిశీలించిన తర్వాత ప్రభుత్వ పని తీరుపై.. ఓ నివేదికను.. జనసేన విడుదల చేసింది. ప్రభుత్వ లోపాలను తీవ్రంగా ఎండగట్టింది. అంతకు ముందు నుంచే పవన్ కల్యాణ్ ఇసుక కొరతపై .. అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్నారు. కొన్ని లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు ఐదు నెలలుగా ఉపాధి కోల్పోయారు. రోజు గడిచే పరిస్థితి లేక అప్పులపాలయ్యారు. అలాంటి కార్మికులందరికీ.. ఒక్కొక్కరికి రూ. పదివేల చొప్పున ఆర్థిక సాయం చేయాలనిపవన్ కల్యాణ్ గతంలోనే డిమాండ్ చేశారు. ఈ డిమాండ్‌ను మరితం గట్టిగా వినిపించే అవకాశం ఉంది.
రాజకీయ వ్యవహారాల కమిటీ, పొలిట్ బ్యూరో సమావేశాల్లో.. ప్రభుత్వ పనితీరుపై పవన్ కల్యాణ్.. సుదీర్ఘంగా పార్టీ నేతలతో చర్చించారు. ఐదు నెలల పాలన అత్యంత నిరాశజనకంగా ఉందని తేల్చారు. ప్రభుత్వంపై ఇక పోరాట పంధాను కొనసాగించాలని నిర్ణయించుకున్నారు. పార్టీ క్రియాశీలకంగా లేదన్న ఉద్దేశంతో కొంత మంది నేతలు పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. మరికొంత మంది నేతల్ని… ఇటు వైసీపీ.. అటు బీజేపీ కూడా.. చేర్చుకుంటోంది. ఫలితంగా.. జనసేన పార్టీ పరిస్థితి నానాటికి తీసికట్టుగా మారుతోంది. దీన్ని మార్చాలంటే.. ప్రజల్లోకి వెళ్లి తీరాల్సిందేనని… జనసేన పొలిట్ బ్యూరో… రాజకీయ వ్యవహారాల కమిటీ నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.