జనసేన అధినేత పవన్ కల్యాణ్ .. గోదావరి జిల్లాల్లో పోరాటయాత్రకు బదులుగా హఠాత్తుగా అమరావతికి భూములిచ్చిన రైతుల కోసం రంగంలోకి దిగారు. ఉండవల్లి రైతులతో సమావేశమైన ఆయన.. ప్రభుత్వం బలవంతంగా భూసేకరణ చేస్తే..భయపడొద్దని ధైర్యం చెప్పారు. ప్రభుత్వం అమరావతి రైతుల విషయంలో మరో బషీర్ బాగ్ చేయాలనుకంటే.. పోలీసుల తూటాలకు .. తన గుండె చూపుతానంటూ.. ఆవేశంగా ప్రకటించారు. ఆమరావతి నిర్మాణం కోసం ప్రభుత్వానికి రైతులు 33 వేల ఎకరాలకుపైగా ఇచ్చారు. అతి కొన్ని గ్రామాల్లో 200 ఎకరాల వరకూ ఇవ్వడానికి రైతులు ముందుకు రాలేదు. దాంతో ప్రభుత్వం భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేసింది. వైసీపీ తరపున వీరి కోసం ఇప్పటికే కొంత మంది కోర్టుల్లో పిటిషన్లు వేశారు. ఇప్పుడు పవన్ కల్యాణ్ రంగంలోకి దిగారు.
రైతులు ఇస్తేనే ప్రభుత్వం భూములు తీసుకోవాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. గ్రామసభలు పెట్టి అందరి అనుమతితో భూములు తీసుకోవాలని, భూములను కొద్దిమంది చేతిలో పెట్టడాన్ని జనసేన వ్యతిరేకిస్తుందన్నారు. అవసరానికి మించి భూములు తీసుకోవద్దని, అసైన్డ్ భూములకూ భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వాలని పవన్ డిమాండ్ చేశారు. వైజాగ్ స్టీల్‌ప్లాంట్‌కు భూములిచ్చిన రైతులు నేటికీ పరిహారం కోసం ఎదురుచూస్తున్నారని గుర్తు చేశారు. ఉండవల్లి రైతులు కూడా.. పవన్ కల్యాణ్‌పైనే పూర్తి బాధ్యత పెట్టారు. గత ఎన్నికల సమయంలో పవన్ కల్యాణ్ చెప్పారనే..తెలుగుదేశం పార్టీకి ఓట్లేశామన్నారు. ఇప్పుడు తమ భూములను కాపాడాల్సిన బాధ్యత కూడా పవన్‌దేనన్నారు. ఉండవల్లిలో ప్రభుత్వం 1200 అడుగుల రోడ్డు నిర్మించడం తమపై కక్ష సాధింపేనని పవన్ కల్యాణ్ దృష్టికి ఆ రైతులు తీసుకొచ్చారు.
పవన్ కల్యాణ్.. గతంలోనూ.. రాజధాని రైతులతో సమావేశమయ్యారు. బలవంతంగా భూములు తీసుకోవద్దని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అయితే ఉండవల్లి రైతులతో పవన్ కల్యాణ్ పర్యటన వ్యూహాత్మకంగా ఏర్పాటు చేసుకున్నదేనన్న ప్రచారం జరుగుతోంది. కొద్ది రోజుల కిందట.. పోరాటయాత్రలో విరామం ఇచ్చి మరీ భూసేకరణ పై మేధావులతో చర్చలు జరిపారు. ఆ తర్వాత అమరావతి భూములపై కొన్ని వివాదాస్పద ప్రకటనలు చేశారు. ఇప్పుడు ఉండవల్లి రైతులను కాస్త రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం వెనుక రాజకీయ ఎజెండా ఉందన్న ప్రచారం జరుగుతోంది.