భారతీయ జనతా పార్టీతో పొత్తుతో… పవన్ కల్యాణ్ ఎలాంటి రాజకీయ ప్రయోజనాలు వస్తాయని ఆశించారో కానీ.. ఓ వర్గం అభిమానుల్ని దూరం చేసుకున్న విషయం మాత్రం పవన్ కల్యాణ్‌కు ఇప్పుడిప్పుడే అర్థమవుతోందని జనసేన వర్గాలు చెబుతున్నాయి. భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్.. దాని వల్ల కలిగే నష్టాలను వీలైనంత వరకూ తగ్గించుకునే ప్రయత్నంలో ఉన్నారు. సందర్భం వచ్చినప్పుడల్లా.. ప్రస్తుతం దేశం మొత్తం బర్నింగ్ ఇష్యూగా ఉన్న ఎన్నార్సీ,సీఏఏ అంశాలను ప్రస్తావిస్తున్నారు. దాని వల్ల.. ముస్లింలు ఎవరికీ ఇబ్బంది కలగదని … కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారం చేస్తోందని అంటున్నారు.
రాయలసీమ జిల్లాల్లో ముస్లిం జనాభా అధికంగా ఉంటుంది. ఈ క్రమంలో బీజేపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత తొలి సారి రాయలసీమకు వెళ్లిన పవన్ కల్యాణ్… సీఏఏ అంశాన్ని కూడా తన బహిరంగ సభ ప్రసంగంలో ప్రస్తావించారు. సీఏఏపై కాంగ్రెస్ నేతలు చేస్తున్న దుష్ప్రచారం తప్ప… ఇందులో వాస్తవంలేదన్నారు. అదే సమయంలో…ముస్లింలకు భరోసా ఇచ్చేందుకు ప్రయత్నించారు. ప్రజలకు అన్యాయం జరిగితే నేను ఊరుకోనని చెప్పుకొచ్చారు. అదే సమయంలో ముస్లిం వర్గాలను ఆకట్టుకునేందుకు ప్రయత్నించారు. దేశపు రక్తపు మూలాల్లోనే సెక్యులర్ భావాలున్నాయని .. మతం పేరుతో రాజకీయాలు చేయాలని చూస్తే తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
పవన్ కల్యాణ్ తాను బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు కాబట్టి.. సీఏఏను సమర్థించకతప్పడం లేదు. ఎన్నార్సీ, సీసీఏ చట్టాలు రాజ్యాంగ విరుద్ధమని దేశవ్యాప్త చర్చ నడుస్తోంది. ముస్లింలు అన్నిచోట్లా ఆందోళనలు చేస్తున్నారు. రాయలసీమ జిల్లాల్లో రోజూ ఏదో ఓ చోట నిరసనలు జరుగుతూనే ఉన్నాయి. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌లో ముస్లింలు కూడా ఎక్కువగానే ఉంటారు. ఈ క్రమంలో అభిమానించే వారి మనసుల్ని అయినా…మార్చడానికి పవన్ కల్యాణ్ ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తోంది. కర్నూలులో.. పవన్ కల్యాణ్ అసలు బీజేపీ ప్రస్తావన తీసుకు రావాల్సిన అవసరం లేదు. బీజేపీతో కలిసి ఆయన ఆ ర్యాలీ చేపట్టలేదు. జనసేన తరపునే ర్యాలీ చేపట్టారు. అయితే.. పొత్తు విషయంలో ముస్లింలతో నెలకొన్న అనుమానాల కారణంగా క్లారిటీ ఇచ్చేందుకు ప్రయత్నించినట్లుగా చెబుతున్నారు