అది ఓ సినిమా ఫంక్షన్. ఓ వారసుడు కొత్తగా తెర మీదకు వచ్చాడు. అందరూ పోటీ పడి పొగుడుతున్నారు. ఒకరేమో సూపర్ డాన్సరంటారు. మరొకరేమో.. అద్భుతమైన నటుడంటారు. అందరూ అన్ని రకాలుగా పొగిడేశాక.. చివరిగా ఓ వ్యక్తి వ్యక్తి.. అతని నవ్వు చాలా గొప్పగా ఉంటుందని అనేశారు. పైకి అందరూ చప్పట్లు కొట్టేశారు కానీ.. చాలా మంది మనసులో అనుకున్న మాట..” ఇంకో విధంగా పొగడొచ్చు కదా..” అని .. ఎందుకంటే.. ఆ వారసుడి నవ్వు అంత వికృతంగా ఉంటుందని..! ఇప్పుడు ఇది ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే… అమెరికాలో పవన్ కల్యాణ్ ఇచ్చిన స్పీచ్‌పై రామ్ చరణ్ ఇచ్చిన ఓవర్ రియాక్షన్ అలాగే ఉంది మరి…!
” అబ్బ.. ఏం చెప్పారు..సార్..?” అంటే అర్థం అయినట్లా..? కానట్లా..?
జనసేన పార్టీకి నిధుల సేకరణ కోసం పవన్ కల్యాణ్ అమెరికా వెళ్లారు. ఇది అందరికీ తెలిసిన నిజం. కానీ ఆయన మాత్రం.. ప్రవాస భారతీయుల H1B వీసాల సమస్య పరిష్కారం వచ్చినట్లు అక్కడ షో చేశారు. నిజానికి ఈ వీసాల సమస్యతో పోలిస్తే… పవన్ కల్యాణ్ సైజ్.. చాలా .. చాలా చిన్నది. ఎంత చిన్నది అంటే.. ఆయనే అమెరికాకు టూరిస్ట్ వీసా మీద వెళ్లి ఉంటారు. అనుమతి మించి ఒక్క రోజు అమెరికాలో ఉన్నట్లు తేలినా.. మరో సారి.. అక్కడ అడుగు పెట్టనివ్వరు. అలాంటిది చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. ఆ క్రమంలో చాలా మాట్లాడారు. ” నిజమైన ధైర్యం అంటే భయం లేకపోవటం కాదు.. రోజూ భయాన్ని ఎదుర్కోవడం. భయాన్ని అధిగమించాలంటే మిమ్మల్ని భయపెట్టే పనినే రోజూ చేయండి. భయంలోని మార్పును ఎదుర్కోలేకపోవడమే పెద్ద భయం…” అంటూ స్పీచ్ దంచేశారు. అక్కడ కూర్చున్న తెలుగువాళ్లు శ్రీశ్రీ సాహిత్యం దగ్గర్నుంచి సిరాశ్రీ సాహిత్యం వరకూ చాలా చదివి ఉంటారు. కానీ దీన్ని మాత్రం అర్థం చేసుకుని ఉండరు. అందుకే.. “అబ్బా.. ఏం చెప్పారు సార్..?” అన్న అర్థంలో చప్పట్లు కొట్టేశారు. ఇక్కడ రామ్ చరణ్ కూడా అదే చేశారు. ఎప్పుడూ లేనిది… చరిత్రలో నిలిపోయే ప్రసంగం అంటూ.. సోషల్ మీడియాలో చప్పట్లు కొట్టేశారు.
అంత గొప్పగా ఎలా అనిపించిందబ్బా..?
అమెరికాలో పవన్ కల్యాణ్ ప్రసంగం.. భగత్ సింగ్ ఆత్మహత్యతో ప్రారంభమై.. ఏపీలో 293,294 అసెంబ్లీ సీట్లతో ముగిసింది. ఇంత అవగాహనా రాహిత్యంతో మాట్లాడిన మొట్ట మొదటి నాయకుడు పవన్ కల్యాణే అయి ఉంటారు. తర్వాత కవర్ చేసుకున్నా.. చేసుకోకపోయినా… ఆయన విజ్ఞానం మాత్రం అలా బయటపడింది. పవన్ కల్యాణ్.. ప్రసంగం వైరల్ అయిపోయింది. ఇటీవలి కాలంలో పవన్ కల్యాణ్ స్పీచ్.. ఇంతగా ట్రోల్ అయిన సందర్భం మరొకటి లేదు. అయినా రామ్ చరణ్ మాత్రం.. చరిత్రలో నిలిచిపోతుందని.. పోస్ట్ పెట్టారు. అంటే బాబాయ్‌పై అంత వెటకారం ఆడుతున్నారా .. రామ్ చరణ్..!
కాకి పిల్ల కాకికి ముద్దు అంటే ఇదేనేమో..?
కాకి పిల్ల కాకికి ముద్దు అనే సామెత ఎందుకు వచ్చిందంటే… తప్పు చేసినా.. ఒప్పు చేసినా మనోళ్లను పొడిగేసుకోవడం వల్ల వచ్చింది. ఇప్పుడు పవన్ కల్యాణ్ విషయంలో… మెగా హీరోలందరూ అదే చేస్తున్నట్లున్నారు. ఎక్కడిక్కడ పవన్ కల్యాణ్… ప్రసంగాల్లో అమాయకత్వాన్ని, అజ్ఞానాన్ని బయటపెట్టుకుంటూ పోతూంటే… ఏడ్వలేక నవ్వుతున్నట్లు.. చప్పట్లు కొట్టి ప్రొత్సహిస్తున్నారు. చివరికి పీఆర్పీ వ్యవహారాలపైనా… పవన్ స్పీచుల్లో… తెలియకుండానే పంచులు పడుతూంటే.. భుజాలు తడుముకోవాల్సిన పరిస్థితి వచ్చినా.. వారేం చలించడం లేదు. అందుకే.. కాకి పిల్ల కాకి ముద్దు అని ఫ్యాన్స్ కూడా సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కనీసం ఇప్పటి నుంచైనా.. పవన్ ను పొడిగే ముందు.. వేరే విధంగా.. పొగడొచ్చేమో… చరణ్ ఆలోచించుకుంటే మంచిదేమో..?
———-సుభాష్