పవన్ కళ్యాణ్ ని అసెంబ్లీలో చూడాలని కలగన్నారు ఆయన అభిమానులు. అద్భుత విజయంతో ఏకంగా ఏపీ డిప్యూటీ సీఎం ప్రమాణస్వీకారం చేసి అభిమానుల కలని తీర్చారాయన. ఇప్పుడు అభిమానుల కోరిక మళ్ళీ ఆయన్ని తెరపై చూడటం. ఓజీ, హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల షూటింగ్‌ను పవన్ కల్యాణ్ పూర్తి చేయాల్సి ఉంది. ఇప్పుడాయన క్షణం తీరికలేకుండా విధుల్లో తలమునకైవున్నారు. తాజాగా పిఠాపురంలో నిర్వహించిన వారాహి సభలో మళ్ళీ సినిమాలు చేయాలని, ఓజీ ముందుకు తీసుకురావాలని పెద్దఎత్తున కోరారు అభిమానులు.
దీంతో తన సినిమాలపై కీలక ప్రకటన చేశారు పవన్ ‘‘సినిమాలు చేసే సమయం ఉందంటారా..? కనీసం రోడ్డు గుంతలు కూడా పూడ్చలేదని మీరు నన్ను తిట్టకుండా ఉండాలి కదా. అందుకే ముందు చెప్పిన పని చేయాలి. లేదంటే ‘నిన్ను ఎన్నుకుంటే నువ్వెళ్లి ‘ఓజీ’ చేస్తావా? క్యాజీ’ అంటే నేనేం సమాధానం చెప్పాలి. షూటింగ్ విషయంలో క్షమించమని నిర్మాతలను కోరాను. ఆంధ్ర రాజ్య ప్రజలకు సేవ చేసుకుంటూ వీలున్నప్పుడు నటిస్తానన్నా. ఓజీ సినిమా బాగుంటుంది’’ అంటూ పవన్ చెప్పడంతో ఒకసారి సభా ప్రాంగణం అభిమానుల కేరింతలతో మార్మ్రోగిపోయింది.