కడపలో యూరేనియం శుద్ధి కర్మాగారం నుంచి వస్తున్న కాలుష్యం, కర్నూలు జిల్లాలో యూరేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా ఉద్యమం చేయాలనుకుంటున్న పవన్ కల్యాణ్ కీలకమైన ముందడుగు వేశారు. వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ప్రసిద్ధి పొందిన రాజేంద్రసింగ్ మద్దతును ఆయన పొందారు. ఈ మేరకు పవన్ కల్యాణ్‌కు రాజేంద్ర సింగ్ ట్విట్టర్ ద్వారా రిప్లై ఇచ్చారు. కడప యురేనియం బాధితులకు అందరూ అండగా నిలవాలని పిలుపునిచ్చారు. సేవ్ నల్లమల ఉద్యమంలో భాగస్వాములు కావాలని అభిలషించారు. కొద్ది రోజుల క్రితం.. పవన్ కల్యాణ్‌ను రాజేంద్రసింగ్ కలిశారు. అప్పట్లో అనేక అంశాలపై పవన్ కల్యాణ్ మాట్లాడారు. ఆ సమయంలో యూరేనియం వల్ల జరుగుతున్న కాలుష్యంపైనా చర్చించినట్లుగా తెలుస్తోంది.
త్వరలో కడపలో పర్యటించాలని రాజేంద్రసింగ్ నిర్ణయించుకున్నారు. యురేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా.. దేశవ్యాప్తంగా అందరి మద్దతు కూడగడతామని ప్రకటించారు. రాజేంద్రసింగ్ పర్యటనను బట్టి.. పవన్ కల్యాణ్.. యూరేనియం తవ్వకాలు, ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా.. జనసేన పార్టీ కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉంది. రాజేంద్ర సింగ్‌తో కలిసి పవన్ కల్యాణ్ కూడా.. యూరేనియం ప్రభావితం ప్రాంతాలలో పర్యటించే అవకాశం ఉంది. రాజేంద్రసింగ్ పర్యటనకు.. జాతీయ ఆసక్తి ఉంటుంది. దీంతో సహజంగానే సమస్య.. జాతీయ స్థాయికి వెళ్తుందని.. పవన్ కల్యాణ్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది.
రాజేంద్ర సింగ్… నీటి కోసం అల్లాడిపోయే రాజస్థాన్‌లో ప్రజల దాహం తీర్చడానికి తన జీవితాన్ని అంకితం చేశారు. రాజస్థాన్‌లో అంతరించిపోయిన 5 నదులకు జీవం పోసి, 1000 గ్రామాలకు నీరందించిన ఘనమైన చరిత్ర ఆయనది. ఆయనతో కలిసి పవన్ కల్యాణ్…యురేనియం పై యుద్ధం చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు.