జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎప్పుడూ లేని విధంగా పార్టీలో కోవర్టులకు వార్నింగ్ ఇచ్చారు. ఉంటే ఉండండి..పోతే పోండన్నారు. జనసేన పార్టీలో కోవర్టుల గురించి కొంత కాలంగా అంతర్గత చర్చ జరుగుతోంది. జిల్లాల వారీగా కొంత మంది నేతలు ఇతర పార్టీలతో కుమ్మక్కయి.. వారి ఎజెండాను జనసేన ఎజెండాగా అమలు చేసే ప్రయత్నం చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. పార్టీలో అంతర్గత విషయాలను వైసీపీకి లీక్ చేయడం ఇటీవలి కాలంలో ఎక్కువయింది. దీంతో పవన్ ఒక్క సారిగా బ్లాస్ట్ అయినట్లుగా తెలుస్తోంది
జనసేన పార్టీకి కోవర్టుల బెడద మొదటి నుంచి ఎక్కువగానే ఉంది. గత ఎన్నికల్లోనే టిక్కెట్లు తీసుకున్న చాలా మంది … ఇతర పార్టీలతో కుమ్మక్కయి సైలెంటయ్యారు. ఈ కారణంగా జనసేన అభ్యర్థులు ఉన్నారా లేరా అన్న స్థితి చాలా నియోజకవర్గాల్లో కనిపించింది. ఆ తర్వాత అలా చేసిన అనేక మంది పార్టీ వీడి అధికార పార్టీలో చేరిపోయారు. ఇప్పుడు మళ్లీ ఎన్నికలు దగ్గరకు వచ్చే సరికి జనసేనలో అలజడి ప్రారంభమయింది. పార్టీలో ముఖ్య నేతల తీరుపై కొంత మంది సోషల్ మీడియాలో ఆరోపణలు చేస్తున్నారు.
ఇదంతా ఓ వ్యూహం ప్రకారం చేస్తున్నారని వారంతా ఇతర పార్టీలతో కుమ్మక్కయ్యారని జనసేన అధినేతకు పక్కా సమాచారం అందినట్లుగా తెలుస్తోంది. కోవర్టుల వ్యవహారంతో పాటు మరికొంత మంది జనసేన ముఖ్య నాయకులుగా చెలామణి అవుతూ టిక్కెట్లు ఇప్పిస్తామని హమీలు ఇస్తూ డబ్బులు డిమాండ్ చేస్తున్నారన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఇలాంటివి గతంలోనూ జరిగాయి. ఈ పరిస్థితిని ముందుగానే గమనించిన పవన్ కల్యాణ్.. హెచ్చరికలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది.