పవర్ స్టార్‌ని దేవుడికంటే ఎక్కువగా ఆరాధించే అభిమానులు చాలా మందే ఉన్నారు. ఆ అభిమానుల విషయం పక్కన పెడితే కొంతమంది విషయంలో మాత్రం పవన్ కళ్యాణ్ నిజంగానే దేవుడయ్యాడు. దేవుడంటే మళ్ళీ మన మతబోధకులు ఊదరగొట్టే ఊకదంపుడు ఉపన్యాసాల అర్థంలో కాకుండా సాయం చేసినవాడు అన్న అర్థంలో దేవుడు అన్న పదాన్ని తీసుకుందాం.
తీన్ మార్, అలాగే గబ్బర్‌సింగ్ ఆడియో రిలీజ్ ఫంక్షన్స్‌లో ఆ రెండు సినిమాల నిర్మాత బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్‌ని ఇంకెవ్వరూ ఎప్పటికీ పొగడలేనంత స్థాయిలో పొగిడేశాడు. చాలా మంది బండ్ల గణేష్ స్పీచ్‌ని కామెడీగా తీసుకున్నారు కానీ వ్యక్తిగతంగా గణేస్ వరకూ చూసుకుంటే మాత్రం ఆయన స్పీచ్ నిజం. నిర్మాతగా బండ్ల గణేష్‌కి అవకాశాలిచ్చి, గణేష్‌ని ప్రొడ్యూసర్‌గా ఇండస్ట్రీకి పరిచయం చేసింది పవన్. ఇందులో డబ్బు లావాదేవీలు కూడా ఉన్నాయి కానీ పవన్‌కి ప్రొడ్యూసర్స్ కొరత అయితే ఎప్పటికీ ఉండదు. అలాగే ఎన్ని కోట్ల రూపాయలు ఉన్నా, ఏ రేంజ్ నాయకుడికి బినామీ అయినా సరే గణేష్‌ని పవన్ ఎంకరేజ్ చేయకపోయి ఉండి ఉంటే ఆయన జీవితం ఇంకోలా ఉండేది.
అలాగే శృతీ హాసన్‌కి కూడా పవన్ కళ్యాణ్ దేవుడనే చెప్పొచ్చు. కమల్ హాసన్ లాంటి యూనివర్సల్ యాక్టర్‌కి కూతురిగా ఇంట్రడ్యూస్ అయిన శృతికి అవకాశాలైతే బాగానే వచ్చాయి కానీ అన్నీ చేదు అనుభవాలనే మిగిల్చాయి. హిందీ, తమిళ్, తెలుగు భాషల్లో ఎన్నో సినిమాలు చేసినప్పటికీ ఒక్కటీ సక్సెస్ కాలేదు. అన్నీ కూడా డిజాస్టర్సే. సక్సెస్‌లో భాగం తీసుకోవడానికి ప్రతివాడూ ముందుకొస్తాడు కానీ ఫ్లాప్ అయ్యిందంటే మాత్రం ఆ సినిమాలో నటించిన హీరోయిన్ పైన ఐరన్ లెగ్ బ్రాండ్ వేసేయడం సినిమావాళ్ళకే కాదు, మన మీడియాకు కూడా బాగా అలవాటు. అలాంటి టైంలో గబ్బర్‌సింగ్ సినిమాలో ఛాన్స్ ఇచ్చాడు పవన్. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడంలో శృతి రోల్ చాలా తక్కువ. కానీ అలాంటి లాజిక్కులు మనవాళ్ళకు అవసరం లేదు. ఆ సక్సెస్‌తో శృతిని స్టార్ హీరోయిన్ని చేసి పడేశారు. వరుస ఫ్లాప్స్‌తో ఐరన్ లెగ్ ముద్ర వేయించుకున్న శృతికి గబ్బర్‌సింగ్‌తో తన లైఫ్ టర్న్ అయిపోయిన విషయం బాగా తెలుసు. అందుకే సందర్భం వచ్చినప్పుడల్లా పవన్‌ని ప్రశంసిస్తూ ఉంటుంది. ఇప్పుడు కాటమరాయుడులో పవన్‌తో కలిసి మరోసారి యాక్ట్ చేస్తోంది కదా. అందుకే మీడియా ముందుకు వచ్చిన ప్రతిసారీ పవన్ గురించి కథలు కథలుగా చెప్పుకొస్తోంది శృతి. బండ్ల గణేస్, శృతీ హాసన్‌లతో పాటు నితిన్‌కి కూడా పవన్ కళ్యాణ్ దేవుడని ప్రత్యేకంగా చెప్పాలా?