పవన్ కల్యాణ్ అటు సినీ హీరోగా, ఇటు రాజకీయ వేత్తగా రెండు కోణాల్లోంచి తన మీదకు సంధిస్తున్న ప్రశ్నలకు ఎడాపెడా సమాధానాలు చెప్పేసిన లేటెస్ట్ ఇంటర్వ్యూ ఇప్పుడు హాట్‌టాపిక్. పవన్ ఇంటర్వ్యూ ఎంత హాట్‌హాట్‌గా చెలామణీ అవుతున్నదో.. అంతే హాట్‌హాట్‌గా దాని మీద వెటకారాలు కూడా చెలామణీ అవుతున్నాయి. ఇవాళ మీడియా అనేది బహుముఖంగా మారిపోయింది. కొన్ని పత్రికలను, కొన్ని టీవీ ఛానళ్లను మనం మేనేజి చేసుకోగలిగితే చాలు.. మన గురించి యావత్తు ప్రపంచానికి మనం కోరుకున్నట్లు మాత్రమే ప్రచారం జరుగుతుంది అనుకునే రోజులు పోయాయి. సోషల్ మీడియా పుణ్యమాని ప్రజలు, ప్రత్యేకించి యువతరం ఎడాపెడా తమ అభిప్రాయాలను క్షణాలు, నిమిషాల్లో వేలమంది దృష్టికి తీసుకెళ్లగలగడం సాధ్యం అవుతోంది. అందుకే పవన్‌కల్యాణ్.. తన వద్ద అసలు డబ్బుల్లేవ్.. స్టాఫ్‌కు జీతాలు ఇవ్వడం కూడా కష్టమైపోతోంది అంటూ అరుస్తున్న బీద అరుపుల గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో అనేకానేక జోకులు హల్ చల్ చేస్తున్నాయి.
పవన్‌కల్యాణ్ వద్ద డబ్బుల్లేవు.. ఆయనకు చందాలిద్దాం.. తలో చేయీ వేయండి అంటూ ఎడా పెడా యువతరం ఆయన మీద వెటకారపు జోకులు వేస్తున్నారు. స్టాఫ్‌కు జీతాలివ్వడానికి డబ్బుల్లేని స్థితిలో 2019 ఎన్నికల్లో పోటీ చేయడానికి డిసైడయ్యాడంటే.. డబ్బులు సంపాదించడానికి సులువైన మార్గమేమిటో పవన్ కల్యాణ్ కనిపెట్టేశాడన్నమాట అని కొందరు, డబ్బు లేనప్పుడు పార్టీ పెట్టి ఎన్నికలకు దిగడమే మంచి బిజినెస్ అని అన్నయ్యనుంచి పాఠం నేర్చుకున్నాడు అని కొందరు ఇలా.. ఎడాపెడా జోకులు సంధించేస్తున్నారు.
మచ్చుకు పవన్ కల్యాణ్ మీద సోషల్ మీడియాలో చెలామణీ అవుతున్న కొన్ని వ్యాఖ్యలు ఇవి పరిశీలించండి….
===
“ఆర్ధికంగా ఇబ్బందుల్లో వున్నాను…నెల గడవడం కూడా కష్టంగా వుంది…స్టాఫ్ కి జీతాలూ ఇవ్వలేని పరిస్థితి…” – పవన్ కల్యాణ్
“హైదరాబాద్ నుంచి అమరావతికి పవన్ కల్యాణ్ ప్రత్యేక విమానంలో, తన సొంత ఖర్చుతో వచ్చారు” – అధికార పార్టీ మంత్రులు…
ఎవరిది అబద్దం ?
‘ఆర్ధికంగా ఇబ్బందుల్లో వున్నాను…
నెల గడవడం కూడా కష్టంగా వుంది…
స్టాఫ్ కి జీతాలూ ఇవ్వలేని పరిస్థితి…
దగ్గర డబ్బుల్లేవు….
ఈ సారి ఎన్నికల్లో పోటీ చేస్తా…!’ (టీవీ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్)
నిజమే ….ఆర్ధిక కష్టాలు తీర్చుకోవడానికి తరుణోపాయం ‘ఎన్నికల్లో పోటీ చేయడం’ కంటే మరొకటి ఏముంటుంది?!
====
…….ఇలా అనేక రకాల జోకులు విచ్చలవిడిగా పవన్ కల్యాణ్ పేదరికం మీద చెలామణీ అవుతున్నాయి. చందాలిద్దాం రమ్మంటూ పోస్టులు పెరుగుతున్నాయి. సహజంగా పవన్ వీటిపట్ల స్పందించకుండా వదిలేస్తారేమో.