జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎట్టకేలకు తన బలం.. బలగం ఏమిటో గుర్తించినట్లుగా ఉన్నారు. తాను నిర్లక్ష్యం చేస్తూండటంతో తన ఓటు బ్యాంక్‌ను కైవసం చేసుకునేందుకు మిత్రపక్ష పార్టీ బీజేపీనే అనేక రకాల ప్రయత్నాలు చేస్తూండటంతో ఇప్పుడు పవన్ కల్యాణ్ కొత్త ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. తన పార్టీకి ఓటు బ్యాంక్‌గా భావిస్తున్న కాపు వర్గాన్ని దగ్గర తీసుకునేందుకు పవన్ చర్యలు ప్రారంభించారు. శుక్రవారం మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో .. కాపు సంక్షేమ సేన ప్రతినిధులతో సమావేశం అవ్వాలని నిర్ణయించుకున్నారు.
కాపు కులస్తులు ఎదుర్కొంటున్న సమస్యలు, కాపు రిజర్వేషన్, ఈ.డబ్ల్యూ.యస్ అమలు వంటి అంశాలపై పవన్ వారితో మాట్లాడుతారు. నిజానికి తనపై కులం ముద్ర పడటం పవన్ కల్యాణ్‌కు ఇష్టం లేదు. తనను కాపు సామాజికవర్గం నెత్తిమీద పెట్టుకోవడాన్ని కూడా ఆయన ఇష్టపడేవారు కాదు. గతంలో కాపు రిజర్వేషన్ల ఉద్యమం జరిగినప్పుడు.. నాయకత్వం వహించే అవకాశం వచ్చినా తనపై ముద్ర పడకూడదని లైట్ తీసుకున్నారు.
కానీ అలాంటి చర్యల వల్ల.. ప్రతీ పార్టీకి పునాదిలాగా ఉండాల్సిన ఓటు బ్యాంక్ వర్గం జనసేనకు ఏర్పడలేదని.. ఎన్నికల ఫలితాలతో తేలిపోయింది. ఏపీలో గణనీయ సంఖ్యలో ఉన్న కాపు సామాజికవర్గం ఏకతాటిగా పవన్ కల్యాణ్‌కు మద్దతుగా నిలిస్తే.. బలమైన పోటీదారు అవుతారు. ఈ అంశాన్ని పవన్ గుర్తించినట్లుగా ఉంది. పంచాయతీ ఎన్నికలకు ముందు… సామాజిక సమీకరణాలతో రంగం సిద్ధం చేసుకుంటున్నారు. పవన్ ఈ ప్రయత్నంలో సక్సెస్ అయితే జనసేనకు కొత్త ఊపిరి వచ్చినట్లుగానే భావించాల్సి ఉంటుంది.