జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోరాటయాత్ర ఓ ప్రహసనంలా మారింది. ఉత్తరాంధ్రలో నలభై ఐదు రోజుల పాటు పర్యటిస్తానని.. నియోజకవర్గంలో రెండు రోజుల కవాతులు చేస్తానని మొదట్లో ఘనంగా ప్రకటించారు. ఇచ్చాపురం ప్రారంభించి.. పాయకరావు పేటకు ఇరవై రోజుల్లో మొత్తం కవర్ చేశారు. ఈ ఇరవై రోజుల్లో పది రోజులు విశ్రాంతి తీసుకున్నారు. సెక్యూరిటీకి గాయాలయ్యాయని ఓ సారి… జ్వరం వచ్చిందని మరోసారి.. నాలుగు రోజుల పాటు బయటకే రాలేదు. ఆ తర్వాత సెక్యూరిటీకి రంజాన్ సెలవులివ్వలాంటూ.. వారం రోజుల ముందుగానే యాత్ర ఆపేశారు. రంజాన్ ప్రారంభమైన పది రోజుల తర్వాత మళ్లీ పోరాటయాత్ర వివరాలు ప్రకటించారు. ఇరవై ఆరు నుంచి… ఎక్కడైతే ఆపేశారో.. అక్కడి నుంచే పోరాటయాత్ర ప్రారంభమవుతుందన్నారు. తీరా ఇరవై ఆరో తేదీ వచ్చేసరికి… మరో ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. 28వ తేదీ నుంచి ప్రారంభమవుతుందని…!
విజవాయడ- గుంటూరు మధ్యలో తనకు రెండు ఎకరాలను రూ. 40 లక్షలకే అమ్మిన లింగమనేని సంస్థ నిర్మించిన దశావతార వెంకటేశ్వరుని ఆలయం విగ్రహప్రతిష్ఠాపనలో పాల్గొనేందుకు ఇరవై ఒకటో తేదీనే విజయవాడ చేరుకున్నారు. ఆలయ కార్యక్రమంలో పాల్గొన్నారు. తర్వాత ఏం చేశారో ఎవరికీ తెలియదు. మాట్లాడితే మేధావులతో సమావేశాలన్న ప్రకటనలు జనసేన ఆఫీసు నుంచి వస్తూంటాయి. భూసేకరణ చట్టం గురించి విజయవాడలో చర్చించారని… మరో విడత విశాఖలో చర్చిస్తారని జనసేన వర్గాలు చెప్పుకొచ్చాయి. నిజానికి భూసేకరణ చట్టంపై ఇప్పటికిప్పుడు ఎందుకు చర్చిస్తున్నారో.. ఎవరితో చర్చిస్తున్నారో ఎవరికీ క్లారిటీ లేదు.
ఇప్పుడే కాదు.. పవన్ కల్యాణ్ పార్టీ పెట్టినప్పటి నుంచి మేధావులతో సమావేశాలని అదే పనిగా ప్రకటనలు చేస్తూనే ఉంటారు. మేధావులంటే.. అదో ప్రత్యేకమైన కేటగిరి అన్నట్లుగా.. వారేదో ఆకాశం నుంచి ఊడిపడిన వ్యక్తులన్నట్లుగా.. జనసేన వర్గాలు చెబుతూంటాయి. అంత గొప్పగా పవన్ కల్యాణ్ తో చర్చించే మేధావులు ఎవరా అంటే… ఎవరికీ తెలియదు. అసలు వాళ్లొచ్చి జనసేన అఫీసులో పడిగాపులు పడతారు… పవన్ ఎప్పుడో వచ్చి.. వారితో రెండు మాటలు మాట్లాడి వెళ్లిపోతారు. అదే చర్చలు. వాస్తవంగా జరిగేది ఇదే. ఈ మాత్రం దానికి పవన్ కల్యామ్ మేధావులతో భేటీలని ఎందుకు ప్రచారం చేసుకుంటారో.. ఎవరికీ అర్థం కావడం లేదు.
సినిమాల్లోలా రాజకీయాల్లో కూడా..కంటిన్యూటీ చాలా ముఖ్యం. ఈ విషయం పవన్ కల్యాణ్‌కు తెలియక కాదు. కానీ… పవన్ ఈ విషయంలో మాత్రం సీరియస్ నెస్ చూపించలేకపోతున్నారు. ఓ సారి యాత్ర ప్రకటిస్తే కష్టమో.న.ష్టమో పూర్తి చేయాలి. లేకపోతకే పబ్లిక్ లో ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది. కానీ పవన్ మాత్రం తనకు గుర్తున్నప్పుడు మాత్రమే పోరాట యాత్ర చేసి…. ఇష్టం లేకపోతే..మేధావులతో సమావేశాలంటే. హోటల్ కో.. విడిదికో పరిమిమతవుతున్నారు. దీని వల్ల ప్రజల్లో ఆయనో రాజకీయ నేత అనే భావనే లేకుండా పోతోంది.
–సుభాష్