హరీష్ శంకర్ ని దర్శకుడిగా నిలబెట్టిన సినిమా `మిరపకాయ్`. నిజానికి ఈ సినిమాని పవన్ కల్యాణ్ తో తీయాలనుకున్నాడు హరీష్. కానీ కుదర్లేదు. అది గుర్తుపెట్టుకునే హరీష్ శంకర్ని పిలిచి `గబ్బర్ సింగ్` ని రీమేక్ చేసే అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు మళ్లీ వీరిద్దరి కాంబినేషన్లో ఓ సినిమా రాబోతోంది. మైత్రీ మూవీస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమా కూడా `మిరపకాయ్` స్టైల్లోనే ఉండబోతోందని తెలుస్తోంది.
ఈ సినిమాలో పవన్ ఏ పాత్రలో కనిపిస్తాడన్న విషయంలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. పవన్ కల్యాణ్ పోలీస్ గా నటిస్తాడని, కాదు.. కాదు పవన్ లెక్చలర్గా నటిస్తాడని గాసిప్పులు వినిపిస్తున్నాయి. పవన్ పోలీసే అని, కాకపోతే కొన్ని సన్నివేశాల్లో లెక్చలర్ గా కనిపించాల్సివస్తుందని అంటున్నారు. మిరపకాయ్లో అంతే. పోలీస్ ఆఫీసర్ అయిన కథానాయకుడు, కొన్ని సన్నివేశాల్లో పాఠాలు చెప్పే మాస్టారుగా మారిపోతాడు. ఈసారీ అంతేలా కనిపిస్తోంది. దానికి తగ్గట్టు పవన్ పుట్టిన రోజున విడుదల చేసిన ప్రీ లుక్ లో ఓవైపు భగవద్గీత, గులాబీ పువ్వుతో పాటు.. పిస్తోలూ కనిపిస్తోంది. మిరపకాయ్ని పవన్ తో తీయలేకపోయిన హరీష్ ఆ లోటుని ఇలా తీర్చుకుంటున్నాడనిపిస్తోంది. ఆ లెక్కన దీన్ని `మిరపకాయ్ 2` అనుకోవాలేమో.