ప్రస్తుతం హరిహర వీరమల్లు షూటింగ్‌తో బిజీగాఉన్నాడు పవన్ కల్యాణ్. ఆ తరవాత పూర్తి చేయాల్సిన సినిమాలు కూడా చాలా ఉన్నాయి. వాటిలో పవన్ ప్రాధాన్యత దేనికి? అనే సస్పెన్స్ నెలకొంది. అయితే… ఇప్పుడు పవన్ దృష్టి హరీష్ శంకర్‌పై పడింది. `హరి హర వీరమల్లు` తరవాత.. వెంటనే హరీష్ సినిమానే పట్టాలెక్కిస్తారు. జులై – ఆగస్టులలో ఓ షెడ్యూల్ ప్లాన్ చేసుకోమని పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. దాంతో.. పవన్ సినిమాకి సంబంధించిన పనుల్ని వేగవంతం చేసే పనిలో పడ్డాడు హరీష్ శంకర్. ఇటీవల పవన్‌ని పలు దఫాలుగా కలిశాడు హరీష్. `మీరు డేట్లు ఇస్తారా. లేదంటే మరో ఆప్షన్ ఉంది.. ఆ సినిమా పూర్తి చేసుకుని రమ్మంటారా` అని పవన్‌ని సున్నితంగానే అడిగినట్టు తెలుస్తోంది. పవన్ అందుకు సానుకూలంగా స్పందించి.. `షెడ్యూల్ ప్లాన్ చేసుకో.. వచ్చేస్తా` అని అభయహస్తం ఇచ్చినట్టు టాక్. ఈ సినిమాలో ముగ్గురు కథానాయికలు ఉంటారన్న టాక్ వినిపిస్తోంది. వాళ్లని సెట్ చేసే పనిలో ఉన్నాడు హరీష్. స్క్రిప్టు ఎప్పుడో పూర్తయిపోయింది కాబట్టి.. ఎలాంటి అడ్డంకులూ లేవు. పైగా సినిమాని చాలా వేగంగా పూర్తి చేయడంలో హరీష్ దిట్ట. కాబట్టే… `హరి హర..` తరవాత హరీష్ సినిమాపై పవన్ దృష్టి పెట్టాడు.