జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన అనంతపురం కరువు యాత్ర అయిపోయింది. ఈ మూడురోజుల యాత్రలో ఆయన ఎంత అవగాహన పెంచుకున్నారు..? గుర్తించిన సమస్యలపై ఎలాంటి పోరాటం చేయాలని నిర్ణయించుకున్నారు..? ఇలాంటి ప్రశ్నలే ఇప్పుడు మిగిలాయి. అనంతపురంలో నీటి కష్టాలు అనే సమస్యపై ప్రధానంగా పవన్ మాట్లాడారు. అయితే, వారానికోసారి చెరువులూ వాగుల దగ్గర పూజల చేస్తూ… అనంత కరువును టీడీపీ తీర్చేసిందని చెప్తుండే మంత్రి పరిటాల సునీత ఇంటికి పవన్ వెళ్లారు. వారిద్దరు కాసేపు కబుర్లు చెప్పుకున్నారు. ఇక, ఈ పర్యటనలో పొత్తు గురించి పవన్ కల్యాణ్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.
2019 ఎన్నికలు చాలా కీలకమైనవి అని పవన్ అన్నారు. ‘నేను ఎవరితో పొత్తు పెట్టుకుంటాను.. తెలుగుదేశం పార్టీతోనా, భారతీయ జనతా పార్టీతోనా, వైయస్సార్ సీపీతోనా అనేది నాకు నిజంగా తెలీదు. నేను లేవనెత్తే ప్రజా సమస్యల కోసం ఎవరైతే పరిష్కారం చూపిస్తారో, సమస్యల పరిష్కారం విషయంలో ఎవరైతే నాకు అండగా ఉంటారో, ప్రజల అభీష్టానికి ఎవరు దగ్గరగా ఉంటే… అలాంటివారితో కలిసి వెళ్లడానికి నేను సిద్ధంగా ఉన్నాను’ అని పవన్ కల్యాణ్ స్పష్టంగా అస్పష్టమైన ప్రకటన చేశారు. ప్రత్యేక హోదాపై కూడా మాట్లాడారు. హోదా సాధనకు అన్ని పార్టీలు కలిసి పోరాటం చేసే పరిస్థితి ఆంధ్రాలో లేదన్నారు. పోనీ, తానొక్కడినే పోరాటం చేద్దామన్నా, మన కొరడా మనమే కొట్టుకుంటే ఏం ప్రయోజనం ఉంటుందన్నారు. ప్రత్యేక హోదా, ప్యాకేజీ విషయమై ప్రజలకు కేంద్రం స్పష్టత ఇవ్వాల్సి ఉందని డిమాండ్ చేశారు.
హోదా విషయంలో పవన్ కల్యాణ్ వ్యాఖ్యల్లో స్పష్టత లేదన్నది అర్థమౌతూనే ఉంది. దీనికంటే ముఖ్యమైంది.. వచ్చే ఎన్నికల్లో పొత్తు గురించి పవన్ చేసిన వ్యాఖ్యలు! మూడు పార్టీలకు తనతో పొత్తు పెట్టుకునే అవకాశం ఉందనే ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. కానీ, ‘తను లేవనెత్తే ప్రజా సమస్యలను పరిష్కరించి, అండగా ఉంటారన్న నమ్మకం ఇస్తే వారితో పొత్తు’ అనే సూత్రాన్ని పవన్ పెట్టుకున్నారు. దీని ఆధారంగానే మిత్రపక్షాన్ని ఎంపిక చేసుకుంటారట! కానీ, అదెలా సాధ్యం..? వాస్తవంలో ఆ నమ్మకం పవన్ ఎలా వస్తుంది..? ప్రజా సమస్యలపై ఫలానా పార్టీ బాగా పోరాడుతుందీ అనే నిర్దరించే కొలమానం ఏది..? ‘ప్రజాభీష్టానికి దగ్గరగా ఎవరుంటే, వారితో కలిసి వెళ్తా’ అనడం కూడా గందరగోళ ప్రకటనే! ఫలానా పార్టీకి ప్రజాభీష్టం దగ్గరగా ఉందని పవన్ ఎలా చెప్పలరు..?
పొత్తు విషయంలో జనసేన గందరగోళంలో ఉందని మరోసారి అర్థమౌతోంది. ఎన్నికల ముందు ఏ రాజకీయ పార్టీ అయినా ప్రజలకు హామీలు మాత్రమే ఇవ్వగలదు. ఇప్పుడు పవన్ లేవనెత్తే, లేదా లేవనెత్తాను ఆయన అనుకున్న సమస్యల పరిష్కారం విషయంలోనూ అంతే జరుగుతుంది. టీడీపీ, భాజపా, వైసీపీ… ఎన్నికల ముందు ఈ పార్టీలేవైనా హామీలు మాత్రమే ఇవ్వగలవు. ఆ హామీల్లోంచి ప్రజాభీష్టానికి దగ్గరగా ఉండే పార్టీ ఏదో పవన్ ఎలా గుర్తిస్తారు..? ఆ లెక్క ప్రకారమే పొత్తు పెట్టుకోవడానికి ఎలా సిద్ధమౌతారు..?