రాజకీయాల్లో ఎన్ని చాలెంజ్‌లు చేసినా.. ఎన్ని డెడ్ లైన్స్ పెట్టినా… కచ్చితంగా తప్పించుకోవడానికి ఎగ్జిట్ పాయింట్ అనేది ఒకటి ఉంచుకోవాలి. అన్ని దారులు మూసేసుకుంటే.. అది రాజకీయం కాదు. ఈ విషయం జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఇంకా అర్థం కాలేదని… శ్రీకాకుళం జిల్లాలో సాగుతున్న పోరాట యాత్ర ప్రసంగాల ద్వారా తేలిపోతుంది. మూడో రోజు టెక్కలిలో పవన్ కల్యాణ్ ఎప్పటిలాగే తన మార్క్ ఆవేశాన్ని రంగరించి ప్రసంగం చేశారు. బాగానే ఉంది కానీ… రెండు రోజుల్లో కిడ్నీ బాధితుల కోసం ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే.. శ్రీకాకుళంలో నిరాహారదీక్ష చేస్తానని ప్రకటించారు. పార్టీ పెట్టిన తర్వాత తొలి సారి సుదీర్ఘ యాత్ర పెట్టుకున్నారు. కానీ దీన్ని మధ్యలోనే అంటే మూడు రోజులకే బ్రేక్ వేస్తాననే మాటను..నిరాహారదీక్ష చాలెంజ్ ద్వారా ప్రజల్లోకి పంపారు.
కానీ నిజానికి పవన్ మాటల్లో సీరియస్ నెస్ ఉందా.. ? అంటే అదీ లేదు. గతంలో ప్రత్యేకహోదా కోసం ఆమరణదీక్ష చేస్తానన్నారు. అప్పుడు ప్రస్తుతం విద్యార్థుల పరీక్షలు కాబట్టి.. పరీక్షలైపోయాక… ఆమరణదీక్ష చేస్తా.. సమయాన్ని నాకొదిలేయండి అన్నారు.. ఇప్పుడు పరీక్షలైపోయాయి.. సెలవులైపోతున్నాయి… స్కూళ్లు మళ్లీ ప్రారంభమవుతున్నాయి. ఆ ఆమరణదీక్ష ఇంకా పెండింగ్‌లో ఉంది. ఆ తర్వాత గుంటూరులో అతి సార మృతులను పరామర్శించేందుకు గుంటూరు ఆస్పత్రికి వెళ్లారు. అక్కడా అంతే ప్రభుత్వానికి రెండు రోజులు డెడ్ లైన్ పెట్టి.. బాధితులకు న్యాయం చేయకపోతే.. నిరాహారదీక్షకు కూర్చుంటానని హెచ్చరించారు. ఆ తర్వాత మర్చిపోయారు. ఇప్పుడు మళ్లీ… కిడ్నీ బాధితుల కోసం రెండు రోజుల డెడ్ లైన్ పెట్టి… నిరాహారదీక్ష శపథాన్ని చేశారు.
నిజానికి ప్రత్యేకహోదా విషయంలో ఆమరణ దీక్ష చేస్తానని ప్రకటించినా ఇంకా చేయలేదు. మిగతా రెండు అంశాల్లో నిరాహారదీక్షను ప్రకటించినా.. అసలు ప్రభుత్వం ముందు నిర్దిష్టమైన డిమాండ్లు ఏం పెట్టారో కనీసం జనసేన నేతలకైనా క్లారిటీ ఉందో లేదో తెలియదు. గుంటూరు అతిసార బాధితులు, కిడ్నీ బాధితులకు నిర్ధిష్టంగా ఏం చేయాలో చెప్పి… నిజంగా నిరాహారదీక్షకు కూర్చుంటే ప్రయోజనం ఉంటుంది. అదీ కూడా.. ఇలా సుదీర్ఘ రాజకీయ పర్యటన ప్లాన్ చేసుకున్నప్పుడు కాదు.ఇప్పుడు నిరాహారదీక్షకు కూర్చున్నా.. కూర్చోకపోయినా రెండు రకాల విమర్శలు వస్తాయి. ఇప్పటికే కిడ్నీ బాధితుల కోసం చాలా చేశామంటున్న ప్రభుత్వం స్పందించే అవకాశం కూడా తక్కువే. ఈ విషయంలో పవన్ బయటపడే మార్గాలను ఉంచుకోకుండా… ఇరుక్కుపోతున్నారు. ఇంకా రాజకీయం అలవాటు చేసుకోలేకపోతున్నారు.
– సుభాష్