పవన్ కల్యాణ్ ఆగ్రహం తర్వాత సోషల్ మీడియాపై ఎలా పోలీసులు విరుచుకుపడ్డారో ఇప్పుడు బియ్యం మాఫియాపై ప్రభుత్వం అలాగే విరుచుకుపడబోతోంది. ఈ అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. ఆయన డీజీపీతో ఈ అంశంపై మాట్లాడినట్లుగా తెలుస్తోంది. సంబంధిత విభాగాల అధికారులతో పూర్తి స్థాయి నివేదిక తెప్పించుకుని ఇంటలిజెన్స్ అధికారులతో కూడా సమావేశాలు ఏర్పాటు చేసి మొత్తంగా ఓ భారీ ఆపరేషన్ ను ప్లాన్ చేయాలనుకుంటున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన కార్యాచరణ ఇప్పటికే ప్రారంభమయిందని అంటున్నారు.
కాకినాడ పోర్టు నుంచి ఎన్ని రకాల స్మగ్లింగ్ జరుగుతుందో చెప్పడం కష్టం. కానీ ఇప్పటి వరకూ ఎవరూ ఆపలేకపోయారు. ఇక ముందు అలా ఉండకూడదని ప్రభుత్వం భావిస్తోంది. కంప్లీట్ గా ఎగుమతులు, దిగుమతుల వ్యవహారాలన్నీ పారదర్శకంగా ఉండేలా ఏర్పాట్లు చేయబోతున్నారు. ఒక్కబస్తా రేషన్ బియ్యం షిప్పులోకి వెళ్లాలన్నా దొరికిపోయేలా ఏర్పాట్లు చేస్తున్నారు. అంతే కాదు ఇప్పటి వరకూ ఎగుమతి చేసిన బియ్యంపైనా దర్యాప్తు చేసే అవకాశాలు ఉన్నాయి. ఆఫ్రికాకు ఎగుమతి చేసిన బియ్యం నిల్వలపై ఇప్పటికే ప్రభుత్వం వద్ద కొంత సమాచారం ఉంది. కేంద్ర ప్రభుత్వం, ఇంటలిజెన్స్‌తో సమన్వయం చేసుకుని మిగిలిన సమాచారం రాబట్టనున్నారు.
బియ్యం మాఫియా సంగతి చూడటానికి వ్యూహాత్మకంగా పవన్ కల్యాణ్ కాకినాడ పోర్టుకు వెళ్లారేమోనని వైసీపీ నేతల్లో అనుమానం బలపడుతోంది. ఆయన అక్కడకు వెళ్లడం వల్ల కాకినాడ పోర్టు నుంచి జరుగుతున్న బియ్యం మాఫియా వ్యవహారానికి దేశవ్యాప్తంగా ప్రచారం వచ్చింది. ఇప్పుడు అక్కడ చర్యలు తీసుకుంటే అందరూ హర్షిస్తారు కానీ ఒక్కరు కూడా రాజకీయ ప్రతీకారం అని అనరు. ఈ మాఫియాలో వైసీపీ కీలక నేత ఉన్నారని ఎక్స్ పోజ్ అవుతుంది. వ్యూహాత్మకంగా పవన్ , చంద్రబాబు కలిసి తమ ఆయువుపట్టుపై కొడుతున్నారని వైసీపీ నేతలు గింజుకునే పరిస్థితి కనిపిస్తోంది.