పిఠాపురం జనసేన ఆవిర్భావ సభలో భాషా వివాదంపై పవన్ కల్యాణ్ చేసిన కామెంట్స్ కు రెండు వైపుల నుంచి విమర్శలు వస్తున్నాయి. అటు హిందీ నుంచి.. ఇటు తమిళ్ నుంచి కూడా విమర్శలు వస్తున్నాయి. ఈ వివాదంపై ఆయన ఎంచుకున్న మాటలే దీనికి కారణం. దేశంలో ప్రజలందరికీ లింగ్విస్టిక్ ఫ్రీడమ్ ఉండాలనేది తన అభిమతమని.. అదే తమ పార్టీ సిద్దాంతం అని పవన్ చెప్పాలనుకున్నారు. కానీ ఏం చెప్పారు?
తమిళ సినిమాల డబ్బింగ్ ప్రస్తావనెందుకు ?
తమిళుల భాషాభిమానాన్ని గౌరవించాల్సిందే. వారి భాష.. వారి ప్రాణం. దాన్ని తక్కువ చేయకూడదు. వారు హిందీని బలవంతంగా నేర్చుకోమని ఒత్తిడి చేస్తున్నారని అలాంటివి వద్దని పోరాడుతున్నారు. ఈ వివాదంపై పవన్ స్పందన సినిమాలతో ముడిపెట్టారు. తమిళ సినిమాల్లో హిందీలోకి డబ్బు చేసి సంపాదించుకుంటున్నారుగా అంటున్నారు. ఇది తమిళుల మనోభావాలను దెబ్బతీసింది. తమిళనాడు నుంచి పవన్ పై తీవ్ర విమర్శలు రావడానికి కారణం అవుతోంది. రేపు ఆయన అక్కడ పర్యటిస్తే ఈ వ్యాఖ్యల కారణంగా ఆయనకు వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది.
ఉత్తరాది నేతలపై పవన్ గతంలో చేసిన వ్యాఖ్యలు వైరల్
గతంలో పవన్ కల్యాణ్ దక్షిణాది ఉద్యమం చేపట్టారు. ఓ ప్రత్యేక వేదిక పెట్టారు. అసలు ఉత్తరాది నేతల దౌర్జన్యం ఏమిటని కూడా ప్రశ్నించారు. హిందీని ఎందుకు నేర్చుకోవాలన్నారు. ఆయన ఏ ఉద్దేశంతో ఈ స్ట్రాటజీ తీసుకున్నారో కానీ కొంత కాలానికే సైలెంట్ అయిపోయారు. కానీ ఆ వీడియోలు.. ట్వీట్లు ఎప్పుడు కావాలంటే అప్పుడు బయటకు వస్తాయి. వచ్చాయి కూడా. ఉత్తరాది నేతలపై ఆయన చేసిన వ్యాఖ్యలను ఇప్పుడు అక్కడ వైరల్ చేసి ప్రశ్నిస్తున్నారు.
ఎన్ని వివరణలిచ్చినా డ్యామేజ్ కవర్ చేయడం కష్టం!
అటు తమిళనాడు.. ఇటు నార్త్ లో తన వ్యాఖ్యలపై వస్తున్న విమర్శలతో పవన్ స్పందించారు. హిందీ, ఇంగ్లిష్ లో వివరణ ఇచ్చారు. కానీ వాటిని అంతగా పట్టించుకోవడంలేదు. రాజకీయంగా కీలకమైన అడుగులు వేసేటప్పుడు మాటలు జారకూడదు. కానీ పవన్ పిఠాపురం సభలో ఉత్సాహంలో కొన్ని మాటలు అనేశారు. వాటి రియక్షన్ ఎక్కువగా ఉంది.