టీడీపీతో పొత్తు ప్రస్తావన లేనప్పుడు తాను ఇక ఎన్నికల్లో పోటీ చేయబోనని పార్టీకి మాత్రమే పని చేస్తానని నాగబాబు ప్రకటించారు. ఇప్పుడు టీడీపీతో పొత్తుతో ఎక్కడ పోటీ చేసినా గెలుస్తామన్న నమ్మకం ఉండటంతో ఆయన మనసు మార్చుకున్నట్లుగా కనిపిస్తోంది. అనకాపల్లి నుంచి నాగబాబును పోటీ చేయించాలని పవన్ కల్యాణ్ ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే కాకినాడ, మచిలీపట్నం స్థానాలను జనసేనకు కేటాయించారు. ఆ స్థానాలకు అభ్యర్థులను కూడా ఖరారు చేశారు. వైసీపీ నుంచి వచ్చిన బాలశౌరికి మచిలీపట్నం, సాన సతీష్ కుమార్ కు కాకినాడ ఇస్తారని చెబుతున్నారు.
ఇప్పుడు అనకాపల్లి కూడా కావాలని పవన్ అడుగుతున్నట్లుగా చెబుతున్నారు. అనకాపల్లి స్థానం కోసం టీడీపీలోనే చాలా పోటీ ఉంది. బైరి దిలీప్ చక్రవర్తి అనే నేతకు చంద్రబాబు సీటు కన్ఫర్మ్ చేశారని అంటున్నారు. కానీ చింతకాలయ విజయ్ గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పుడు నాగబాబు రంగంలోకి వస్తున్నారు. దీంతో అనకాపల్లి వ్యవహారం హాట్ హాట్ గా మారే అవకాశం కనిపిస్తోంది. నాగబాబు ఇప్పటికే విశాఖ చేరుకున్నారు. ఆయనకు సోదరుడు హామీ ఇచ్చి ఉంటారన్న చర్చ జరుగుతోంది.
గతంలో నర్సాపురం నుంచి నాగబాబు పోటీ చేశారు. నర్సాపురం పొత్తుల్లో ఏ పార్టీకి వెళ్తే ఆ పార్టీ నుంచి రఘురామ పోటీ చేస్తారు. అందుకే అక్కడ చాన్స్ లేదు. మెగా ఫ్యామిలీ నుంచి చిరంజీవి మాత్రం ఒక్క సారిగా ఎమ్మెల్యే గా గెలిచారు. మరో చోట ఓడిపోయారు. తర్వాత ఎవరు పోటీ చేసినా గెలవడం లేదు. ఈ సారి పవన్ తో పాటు నాగబాబు కూడా ప్రజాప్రతినిధి అవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా తెలుస్తోంది.