జనసేన అధినేత పవన్ కల్యాణ్ చాలా రోజుల తర్వాత రాజకీయ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు బయటకు వస్తున్నారు. ఏడో తేదీన మంగళగిరిలోని జనసేన పార్టీ ఆఫీసులో ఆయన కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. కరోనా కారణంగా జనసేన శ్రేణులు స్తబ్దుగా ఉన్నాయి. తిరుపతి ఉపఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పవన్ కల్యాణ్‌కు కరోనా సోకడంతో ఆయన హోమ్ ఐసోలేషన్‌లో ఉన్నారు. ఆ తర్వాత కోలుకున్నప్పటికీ.. పెద్దగా యాక్టివ్ కాలేదు. పవన్ స్తబ్దుగా ఉంటే.. పార్టీని నడిపించే యంత్రాంగం సిద్ధం కాకపోవడంతో.. చురుకైన నేతలు ఉన్న చోట మాత్రం.. జనసేన ఉనికి కాపాడేలా ప్రభుత్వంపై నిరసన కార్యక్రమాలు చేపట్టారు.
అయితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వంపై పోరాడుతున్నామన్న అభిప్రాయాన్ని మాత్రం కల్పించలేకపోయారు. చివరికి బీజేపీ కూడా.. కొన్ని ధర్నాలు చేసింది. వీటిలో జనసేనకు చోటు ఇవ్వలేదు. ప్రస్తుతం ప్రభుత్వం అనేకానేక సమస్యల్లో ఉంది. ప్రజలు కూడా కష్టాల్లో ఉన్నారు. జాబ్ క్యాలెండర్ దగ్గర్నుంచి ఇచ్చిన సెంట్ స్థలాల్లో సొంత డబ్బులు పెట్టుకుని గ్రౌండింగ్ చేయాలంటూ… ప్రభుత్వం పేదలను వేధిస్తున్న వైనం.. ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అలాగే వరుసగా బయట పడుతున్న కుంభకోణాలు.. పేదల్ని ఆదుకునే విషయంలో ప్రభుత్వం నిర్లిప్తత.. ఇలాఎన్నో సమస్యలు ఉన్నాయి. ముఖ్యంగా ఉద్యోగ క్యాలెండర్ విషయంలో నిరుద్యోగ యువత రగిలిపోతోంది.
ఇన్ని సమస్యలు ఉన్నా ఇంత కాలం జనసేన పట్టించుకోకపోవడంతో ఉనికి కనిపించలేదు. ఇక నుంచి అలాంటి పరిస్థితి ఉండకూడదని పవన్ కల్యాణ్ భావిస్తున్నారు. భారీ ఎత్తున పోరాట కార్యక్రమాలు చేపట్టాలని.. ప్రభుత్వాన్ని ఉక్కిరిబిక్కిరి చేయాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ప్రభుత్వం అన్ని వర్గాల్లో అసంతృప్తి పేరుకుపోతోందని.. దాన్ని ఉపయోగించుకుని ప్రజా మద్దతు పొందాలన్న ఆలోచన చేస్తున్నారు. ఎలాంటి కార్యచరణ చేపడతారు.. పవన్ కల్యాణ్ స్వయంగా పోరుబాట పడతారా లేదా.. అనేది.. ఏడో తేదీన తేలే అవకాశం ఉంది.