వచ్చే ఎన్నికలు తన భావజాలానికి పరీక్షా సమయమనీ, తాను నిలబడటానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. సరికొత్త వ్యవస్థ రావాలంటే పాత వ్యవస్థల్ని సంపూర్ణంగా దహనం చేయాలన్నారు. వ్యవస్థ మారే సమయం వచ్చిందనీ, డబ్బులిస్తామంటూ అంటూ చెప్పే పథకాలతో ముందుకెళ్లదన్నారు. ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ముప్ఫయ్యేళ్లపాటు ముఖ్యమంత్రిగా ఉండాలనుకుంటారనీ, కానీ ఆయన అసెంబ్లీకి వెళ్లరని పవన్ విమర్శించారు. ఏదైనా అంటే తన వ్యక్తిగత జీవితాన్ని తిడతారనీ, మీరు అసెంబ్లీకి వెళ్లండని బాధ్యత తాను గుర్తుచేసినా తిడతారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా తనపై దాడులు చేస్తారనీ, ఇసుక మాఫియా గురించీ జన్మభూమి కమిటీల గురించి చెబుతుంటే తనని విమర్శిస్తారన్నారు. ముఖ్యమంత్రిగానీ, నారా లోకేష్ గానీ, జగన్ గానీ… ప్రజలకు మూడు తరాల భవిష్యత్తు ఇస్తామని చెప్పలేరనీ, తామే మూడు తరాలు ఉండాలని కోరుకుంటారన్నారు.
ఒకప్పుడు జగన్ తెలంగాణకు వెళ్తే, అక్కడ అడుగుపెట్టనీమని చెప్పిన వ్యక్తులు… ఈరోజున ఇక్కడికి వచ్చి జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నారంటే పరిస్థితులు ఎంతగా మారిపోతున్నాయో గమనించాలన్నారు. పట్టుమంది పదిమంది లేరు తెలంగాణ గురించి మీరేం మాట్లాడతారని అసెంబ్లీ ఈటెల రాజేంద్రతో రాజశేఖర్ రెడ్డి మాట్లాడారనీ, ఇవాళ్ల ఆయన కొడుక్కి తెలంగాణ నాయకులు ఓపెన్ గా మద్దతు ఇస్తున్నారన్నారు. చంద్రబాబు మీద కక్ష కోసం ఇలా చేసుకుంటూ వెళ్లిపోతున్నారన్నారు. వ్యక్తులు వ్యవస్థను వాడుకోవడం చూస్తుంటే తనకు భయం వేస్తుంటుందన్నారు.
ఒక వెన్నుపోటు పొడిచి వచ్చారంటూ చంద్రబాబు గురించి అంటారనీ, ఆ మాట ఎప్పుడూ నిలబడిపోతుందనీ, భావితరాల వరకూ అదే అభిప్రాయం ఉండిపోతుందన్నారు పవన్. జగన్ గురించి ఎవరైనా మాట్లాడితే… లక్ష కోట్లు తిన్నావ్, నువ్వేంటయ్యా మాట్లాడతావ్ అంటూ టీడీపీవాళ్లు విమర్శిస్తారన్నారు. అవినీతి పునాదుల మీద, వెన్నుపోటు రాజకీయాల మీద పార్టీలు పెడితే ఆ తప్పులు ఎప్పటికీ వెంటాడుతూనే ఉంటాయన్నారు. తాను విసిగిపోయి ప్రజల పక్షాన నిలిచాననీ, దమ్ముగా ఒకడు కావాలి, రాజకీయాల్లోకి రావాలని వచ్చానన్నారు పవన్. వ్యవస్థ మారే సమయం ఇప్పుడు వచ్చిందన్నారు.
పవన్ తాజా విమర్శలు కాస్త ఘాటెక్కాయనే చెప్పొచ్చు. అయితే, దీని వెనక వ్యూహం కూడా స్పష్టంగానే ఉంది. ఏపీలో చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా పనిచేసే పార్టీలతో కలిసి జనసేన కచ్చితంగా చేతులు కలుపుతుందనే ఒక అభిప్రాయం ఉంది. వైకాపాకి జనసేనను దగ్గర చేసే ప్రయత్నం జరుగుతోందని ఆయనే స్వయంగా చెప్పారు. దాన్ని నిర్ద్వంద్వంగా తోసిపుచ్చడం, తామెవ్వరితోనూ కలిసి వెళ్లం అనే సంకేతాలు బలంగా ఇవ్వడమే పవన్ ఉద్దేశంగా కనిపిస్తోంది. అందుకే, తాజా విమర్శల్లో ఎక్కువగా జగన్ గురించి మాట్లాడారు.