ఉద్ధానం కిడ్నీ వ్యాధి సమస్యపై హార్వర్డ్ యూనివర్సిటీ నిపుణల బృందంతో కలసి పరిశీలనలో పాల్గొన్న జనసేన అద్యక్షుడు పవన్ కళ్యాణ్ తాను చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తరపున పనిచేయడం లేదని ఒకటికి రెండు సార్లు వివరణ ఇచ్చుకున్నారు. మానవీయతతో చూడాలి తప్ప రాజకీయం చేయదలచలేదంటూ జగన్‌ను కలవడానికి అభ్యంతరం లేదని ప్రకటించారు. అయితే ఆయన అక్కడ పర్యటన ముగించుకుని అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలుసుకోవడానికి వచ్చిన తీరు వచ్చే సమయంలో రాష్ట్ర ప్రభుత్వ తీరు కూడా రాజకీయ విమర్శలకు అవకాశం పెంచుతున్నాయి. మొదటిది-గన్నవరం విమానాశ్రయంలో ఆయనకు స్వాగతం పలికి తీసుకురావడానికి ఆరోగ్యమంత్రి కామినేని శ్రీనివాస్ వెళ్లడం.. సమస్యలపై చర్చించేందకు వచ్చేవారిని ఇలా ప్రభుత్వ ప్రతినిధులు ఎదురేగి తీసుకురావడం ఇదే మొదటిసారి కావచ్చు.
చాలాసార్లు ఇతర ప్రతిపక్షాలకు ఆటంకాలు కల్పించడం కూడా చూశాం. ఇక రెండవది- ఈ సమయంలో చంద్రబాబుతో వన్ టు వన్ సమావేశం జరపడం.. అందుకోసం ఉద్థానం మాత్రమే గాక మరో మూడు అంశాలపైన కూడా ప్రభుత్వం నోట్సు సిద్ధం చేసిందన్న సమాచారం చూస్తే పూర్తి స్థాయిలో దీన్ని రాజకీయంగా వాడుకునే ప్రయత్నం జరుగుతుందన్న మాట. పోలవరం నిధులు, కాపుల రిజర్వేషన్, కేంద్రం సహాయం వంటి అంశాలపై ప్రభుత్వ వాదనలను పవన్‌కు చెప్పి కన్విన్స్ చేయడానికి ప్రయత్నిస్తారు. ఉద్ధానం విషయంలోనూ తాము తీసుకున్న చర్యలపైనా పవర్ పాయింట్ ప్రెజంటేషన్ ఇస్తారట. అంటే మొత్తంపైన ఇది ఒక సమస్య పరిష్కారానికి అవసరమైన నిర్దిష్ట నిర్మాణాత్మక చర్చగా గాక సాధారణ రాజకీయ వివరణగా మారిపోతున్నది. స్వాగతమైనా ఇతర సమస్యలపై చర్చ అయినా ఒక వేళ ప్రభుత్వం ప్రతిపాదించినా పవన్ వద్దని వుండాల్సింది.