అసెంబ్లీ సమావేశాలకు ప్రతిపక్ష పార్టీ రావడం లేదు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు ఉండాలనీ, అదే కారణాన్ని పదేపదే చెబుతూ సభకు డుమ్మా కొడుతున్నారు. జనసేన ఆవిర్భావ సభలో పవన్ కల్యాణ్ ఈ అంశంపై మాట్లాడారు. ప్రత్యేక హోదాపై కనీసం ప్రతిపక్షమైనా బలంగా పోరాడుతుందా అంటే వారు అసెంబ్లీకే రావడం లేదని ఎద్దేవా చేశారు. తాను ముఖ్యమంత్రి అయితే తప్ప జగన్ అసెంబ్లీకి రానంటే ఎలా.. అంటూ ప్రశ్నించడం వరకూ బాగానే ఉంది. కానీ, ఇదే సమయంలో అన్నయ్య చిరంజీవి కూడా రాజ్యసభకు వెళ్లడం లేదు కదా! రాష్ట్ర సమస్యలపై ఆయనా మాట్లాడం లేదు కదా! ఆ విషయం పవన్ కల్యాణ్ కి గుర్తులేదా అనేది కొంతమంది సూటి ప్రశ్న..?
చిరంజీవి రాజ్యసభ సభ్యుడు, ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు అని చాలామంది మరచిపోయారు..! ఆ స్థాయిలో ఆయన క్రియాశీలత ఉంది మరి! ఎప్పుడో గత ఏడాదిలో ఒక్క రోజు మాత్రమే రాజ్యసభలో కనిపించారు. అది కూడా.. జీఎస్టీ బిల్లుపై కాంగ్రెస్ నేతలంతా వ్యతిరేకంగా ఓటెయ్యాలని పార్టీ నిర్ణయించి, విప్ జారీ చేసింది. దాని కోసం మాత్రమే ఒక్కసారి అలా మెరిసి వెళ్లిపోయారు. ఆ తరువాత, ఆయన కనిపించిందీ లేదు, రాజకీయ నాయకుడిగా ఆయన మాట వినిపించిందీ లేదు. కేంద్ర బడ్జెట్ లో ఏపీకి అన్యాయం జరిగిందని ఏపీ కాంగ్రెస్ నేతలు కూడా కేంద్రంపై పోరాటం చేస్తున్నారు. కాంగ్రెస్ ఎంపీ కేవీపీ రామచంద్రరావు ఒక ప్లకార్డు పట్టుకుని నిత్యం సభలో దర్శనమిస్తూనే ఉంటారు. కనీసం ఇలాంటి సమయంలోనైనా చిరంజీవి స్పందించలేదు. సరే, ఆయన పదివీ కాలం త్వరలోనే ముగుస్తుందీ అనుకుందాం. పోనీ, కాంగ్రెస్ నేతగా వద్దు, కనీసం ఒక ప్రముఖ నటుడిగానైనా స్పందించాలి కదా. సొంత అన్నయ్య వ్యవహార శైలి ఇలా ఉంటే… పవన్ దీని గురించి మాట్లాడటం మరచిపోయారేమో..!
రాజ్యసభ వెబ్ సైటు ప్రకారం ఏపీ ఎంపీలు రాజ్యసభలో సగటున 435 ప్రశ్నలు అడిగారు. ఆ కోటాలో ఒక్కటంటే ఒక్క ప్రశ్న కూడా చిరంజీవి నోట వినే అదృష్టం ఆంధ్రులకు లేకుండా పోయింది..! ప్రశ్నలు సంగతి దేవుడికెరుక… కనీసం ఆయన సమావేశాలకు హాజరైనా కూడా కొంత ఫర్వాలేదని సంత్రుప్తి చెందే అవకాశమూ ఆయన ప్రజలకు ఇవ్వలేదు. ‘సమస్యలపై స్పందించాలంటే పదవులే కావాలా, నేను స్పందించడం లేదా’ అంటూ జగన్ ని పవన్ గొప్పగా నిలదీశారే.. మరి, పదవిలో ఉంటూ కూడా రాజ్యసభకు గైర్హాజరైన అన్నయ్య మెగా స్టార్ చిరంజీవి బాధ్యతను కూడా పవన్ ప్రశ్నించాలి కదా..? రాగద్వేషాలకు అతీతంగా రాజకీయాల్లోకి వచ్చానని పవన్ చెబుతుంటారే… అలాంటప్పుడు, చిరంజీవి గైర్హాజరీని మరచిపోతే ఎలా..?