జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ గతంలో సనాతన ధర్మంపై మాట్లాడినప్పుడు.. ఆయన దక్షిణాదిలో హిందూత్వ లీడర్ గా ఆవిర్భవించేందుకు అవసరమైన కార్యాచరణ ఖరారు చేసుకుంటున్నారని అనుమానించారు. అయితే పవన్ ఎప్పుడూ అలాంటి రాజకీయ టార్గెట్లు తనకు ఉన్నాయని చెప్పలేదు. కానీ ఇప్పుడు మెల్లగా తన కార్యాచరణ ప్రారంభిస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లోని అన్ని ప్రముఖ ఆలయాలను సందర్శించబోతున్నారు. మొదటగా ఆయన కేరళ వెళ్తున్నారు. అక్కడ మూడు రోజుల పాటు ఆలయాలను సందర్శిస్తారు. ఆయన పర్యటన ఖచ్చితంగా రాజకీయం అవుతుంది. పవన్ కల్యాణ్ రాజకీయం లేదని.. చెప్పవచ్చు. కానీ జరుగుతున్న రాజకీయంలో భాగంగానే పర్యటనలు అని మీడియా ఖచ్చితంగా ప్రచారం చేస్తుంది.
కేరళ తర్వాత పవన్ తమిళనాడు వెళ్లే అవకాశం ఉంది. తమిళనాడు బీజేపీ టార్గెట్. అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ తనదైన ప్రభావం చూపాలని పట్టుదలతో ఉంది. అన్నామలై తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా హిందూత్వవాదం, దేశభక్తి నినాదంతో తన ప్రయత్నాలు తాను చేస్తున్నారు. అయితే అనుకున్నంతగా ప్రయత్నాలు సఫలం కావడం లేదు. గతంలో ఉదయనిధి చేసిన సనాతన ధర్మ వ్యతిరేకత వ్యాఖ్యలను కూడా సరిగ్గా ఉపయోగించుకోలేక..హిందూ వర్గాల్లో కదలిక తీసుకురాలేకపోయారు. ఇప్పుడు ఆ బాధ్యతను పవన్ తీసుకునే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. ఉదయనిధి చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే పవన్ విమర్శలు చేశారు.
తమిళనాడులో పవన్ చేసే పర్యటన అక్కడి రాజకీయాల్లో మార్పులు తెచ్చే అవకాశాలు ఉన్నాయి. తర్వాత కర్ణాటక. తెలంగాణలోనూ పవన్ ఆలయాల సందర్శన ఉంటుంది. ఇదంతా ఓ ప్లాన్ ప్రకారం జరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఈ వర్యటనలతో పవన్ కల్యాణ్.. దక్షిణాదిన పూర్తి స్థాయి హిందూత్వ లీడర్ గా అవతారం ఎత్తుతారని జనసేన వర్గాలు అంచనా వేస్తున్నాయి. పాన్ ఇండియా లీడర్ గా ఎదిగే క్రమంలో పవన్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని జనసైనికులు ఓ అంచనాకు వచ్చారు.